వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇద్దరు ప్రధాన అభ్యర్థులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోతే అమెరికాను వీడుతానని చెప్పుకొచ్చారు. వెనిజులాకు వెళ్లిపోతానని అన్నారు.
కాగా, అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏదైనా జరిగి నేను ఓడిపోతే అమెరికాను వీడుతాను. మనం మళ్లీ వెనిజులాలో కలుద్దాం అంటూ మస్క్‌తో ట్రంప్ అన్నారు. ఎందుకంటే.. అమెరికా కంటే వెనిజులా సురక్షితమైన ప్రాంతం. మీరు కూడా అక్కడికి రండి.. ఇద్దరం కలిసి డిన్నం చేద్దాం అని చెప్పారు.
ఇదే సమయంలో బైడెన్ సర్కార్‌పై సెటైరికల్ కామెంట్స్ చేశారు. వెనిజులాలో ప్రమాదకరమైన నేరస్థులను కూడా జైళ్ల నుంచి విడుదల చేస్తున్నారు. అనంతరం, వారిని అమెరికాకు అక్రమంగా వలస పంపిస్తున్నారు. అందుకే అక్కడ నేరాల రేటు బాగా తగ్గింది. అదే సమయంలో అమెరికాలో క్రైమ్ రేటు బాగా పెరిగిందన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మరో కామెంట్ కూడా చేశారు. తాను ఎన్నికల్లో గెలిస్తే అక్రమ వలసలను అడ్డుకుంటానని అన్నారు. అమెరికాలోకి అక్రమ వలసలను అడ్డుకోవడమే తన లక్ష్యం అని చెప్పుకొచ్చారు.
ఇక, ట్రంప్ వ్యాఖ్యలపై డెమోకట్రిక్ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోతున్నట్టు తెలుసుకున్నారని కామెంట్స్ చేశారు. ఓటమిని ఒప్పుకున్నారు కాబట్టే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment