ఇప్పటి విలువలో దాని ధర రూ. 53 కోట్లు! | ENIAC First Computer Anniversary 75 Years Of Computer Technology | Sakshi
Sakshi News home page

ఇప్పుడు చిన్నగా ఉంది గానీ.. అప్పుడు 27 టన్నుల బరువు

Published Tue, Mar 2 2021 1:38 PM | Last Updated on Tue, Mar 2 2021 7:45 PM

ENIAC First Computer Anniversary 75 Years Of Computer Technology - Sakshi

బరువేమో ఏకంగా 27 టన్నులు!.. ఆక్రమించే స్థలం 1800 చదరపు అడుగులు! .. తయారీకైన ఖర్చు సంగతి సరేసరి... ఈ రోజు విలువలో ఏకంగా రూ.53 కోట్లు! .. ఏమిటీ వివరాలు అనుకుంటున్నారా? ఈ రోజుల్లో మన  అరచేతుల్లో ఇమిడిపోయి...  విద్య, వినోద, విజ్ఞాన ప్రపంచానికి కిటికీగా మారిన కంప్యూటర్‌ తొలి రూపం గురించి! ఇప్పుడు ఎందుకంటారా....  మనకు పరిచయమై 75 ఏళ్లు అవుతోంది కాబట్టి!  

ఎలక్ట్రానిక్‌ న్యూమరికల్‌ ఇంటిగ్రేటర్‌ అండ్‌ కంప్యూటర్‌... క్లుప్తంగా ఇనియాక్‌! ప్రపంచంలో తొలి కంప్యూటర్‌ ఏదంటే వచ్చే సమాధానం ఇదే. 1946 ఫిబ్రవరిలో తొలిసారి ఇది ప్రపంచానికి పరిచయమైంది. అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని మూర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో 1943లో ఇనియాక్‌ నిర్మాణం మొదలైంది. ఎనభై అడుగుల పొడవులో యూ ఆకారంలో తయారైన ఇనియాక్‌లో మొత్తం 18,800 రేడియోవాల్వ్‌లు, వ్యాక్యూమ్‌ ట్యూబ్‌లు ఉండేవి. క్షిపణుల ప్రయాణ మార్గాన్ని లెక్కించి ఇవ్వడం ఈ తొలితరం కంప్యూటర్‌ ప్రధాన లక్ష్యం. ‘ప్రాజెక్ట్‌ పీఎక్స్‌’పేరుతో అమెరికన్‌ మిలటరీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీలు దీని తయారీని చేపట్టాయి. డాక్టర్‌ జాన్‌ డబ్ల్యూ మాచ్లీ, జే.ప్రెస్పర్‌ ఎకర్ట్‌ జూనియర్‌ల ఆధ్వర్యంలో సిద్ధమైంది.  

భారీ వ్యవస్థ... 
ఇప్పుడంటే కంప్యూటర్‌ అనేది అరచేతిలో ఇమిడిపోయిందిగానీ.. ఇనియాక్‌ మాత్రం ఓ భారీ వ్యవస్థను పోలి ఉండేది. ముందుగా చెప్పుకున్నట్లు మొత్తం 18,800 రేడియో వాల్వ్‌లు, వ్యాక్యూమ్‌ ట్యూబ్‌లు మాత్రమే కాదు.. సుమారు 70 వేల రెసిస్టర్లు, 10 వేల కెపాసిటర్లు, 6 వేల స్విచ్‌లు... ఎకాఎకిన 50 లక్షల సోల్డరింగ్‌ జాయింట్లు చేరితే ఇనియాక్‌ అయింది. అంతేనా... ఊహూ కానే కాదు. 1,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ వ్యవస్థలో 9 అడుగుల ఎత్తైన ప్యానెళ్లు 42 ఉండగా.. వాటిని అడుగు మందమున్న ఉక్కుతో తయారు చేశారు. ఒక్కో ప్యానెల్‌ పైభాగంలో వ్యవస్థను చల్లబరిచేందుకు ఫ్యాన్ల వంటివి ఏర్పాటు చేశారు.

ఇంతటి భారీ వ్యవస్థతో పనిచేసేందుకు ఏకంగా 150 కిలోవాట్స్‌/గంటల విద్యుత్తు అవసరమయ్యేదంటే ఆశ్చర్యమేమీ లేదు. లెక్కలు వేయాల్సిన ప్రతిసారి ఉన్న 6 వేల స్విచ్‌లలో కొన్నింటిని భౌతికంగా సరి చేయాల్సి వచ్చేది. అప్పట్లో ఇందుకోసం ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని నియమించారు. కే మెక్‌నల్టీ, బెట్టీ జెన్నింగ్స్, బెట్టీ స్నైడర్, మార్లిన్‌ వెస్కాఫ్, ఫ్రాన్‌ బిలాస్, రూథ్‌ లిచెటర్‌మ్యాన్‌ అనే మహిళలు ఈ ప్రోగ్రామింగ్‌ను చేసేవారు. ఈ లెక్కన ప్రపంచంలోనే తొలి ప్రోగ్రామర్లు ఎవరంటే.. ఈ మహిళలనే చెప్పాలన్నమాట.  

రెండో ప్రపంచ యుద్ధంలో వినియోగించనున్న ఆధునిక ఆయుధాల కోసం ఇనియాక్‌ను సిద్ధం చేయాలనుకున్నా జపాన్‌ అమెరికాకు లొంగిపోయిన తరువాత అంటే రెండో ప్రపంచ యుద్ధం పూర్తయ్యే సమయానికిగానీ ఇది తయారు కాలేదు. కాకపోతే ఇది హిరోషిమా, నాగసాకీలపై పడిన అణుబాంబుల తయారీలో భాగస్వామిగా మారింది. ప్రస్తుతం ఇనియాక్‌ను ముక్కలు ముక్కలుగా చేసి పెన్సిల్వేనియా వర్సిటీతోపాటు లండన్‌లోని స్మిత్‌సోనియన్‌ సైన్స్‌ మ్యూజియం తదితర ప్రాంతాల్లో ప్రదర్శనకు ఉంచారు. 

జనగణన మొదలుకొని అధ్యక్షుడి ఎంపిక వరకూ.. 
ఇనియాక్‌గా మొదలైన ఆధునిక కంప్యూటర్‌ ప్రస్థానం ఎక్కువ కాలం కొనసాగలేదు. 1955 నాటికి ఇనియాక్‌ను మూతవేయగా మాచ్లీ, ఎకర్ట్‌లు అప్పటికే రెండో తరం కంప్యూటర్‌ ఎడ్‌వ్యాక్‌ డిజైన్‌ను సిద్ధం చేసుకున్నారు. ఎకర్ట్‌–మాచ్లీ కంప్యూటర్‌ కార్పొరేషన్‌ పేరుతో ఓ సంస్థను స్థాపించి వాణిజ్యస్థాయిలో కంప్యూటర్ల తయారీ చేపట్టారు. ఈ సంస్థ తయారు చేసిన యునివాక్‌ కంప్యూటరే 1950 నాటి అమెరికా జనాభా లెక్కల గణన చేపట్టింది. ఆ తరువాత 1952లో విజయవంతంగా అమెరికా అధ్యక్ష ఎన్నిక విజేతను అంచనా కట్టింది కూడా.  
– సాక్షి, హైదరాబాద్‌  

చదవండిలగ్జరీ గృహాల అద్దెల్లో హైదరాబాద్‌ టాప్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement