గత కొద్ది రోజులుగా ఖలిస్తాన్ పేరు చర్చలలోకి వస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెన్సీల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఈ నేపధ్యంలో భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ సమయంలో ఖలిస్తాన్ ఉదంతం ఏమిటో తెలుసుకోవాలనే అసక్తి అందరిలో పెరిగింది. ఈ ఉద్యమం ఏమిటో? అది ఎలా మొదలైందో తెలియని వారు గూగుల్ సాయంతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. అందుకే ఖలిస్తాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఖలిస్తాన్ అంటే ఏమిటి?
భారతదేశంలో ఖలిస్తాన్ ఉద్యమ మూలాలు ఎప్పుడో అంతరించిపోయాయి. అయితే ఆ తర్వాత కొందరు విదేశాల్లో ఉంటూ ఖలిస్తాన్ పేరిట అనేక ఉద్యమాలు సృష్టిస్తున్నారు. భారత్‌పై విద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు వారు నిరంతరం కృషిచేస్తున్నారు. వారు భారతదేశం నుండి పంజాబ్‌ను వేరు చేయాలనే ఉద్యమానికి ఖలిస్తాన్ ఉద్యమం అని పేరు పెట్టారు.
ఖలిస్తాన్ అనే పేరు ఎలా వచ్చింది?
ఖలిస్తాన్ అనేది ఖలీస్ అనే అరబిక్ పదం నుండి ఉద్భవించింది. ఖలిస్తాన్ అంటే ఖల్సాకు చెందిన భూమి. అంటే సిక్కులు మాత్రమే నివసించే ప్రదేశం. 1940లో లాహోర్ డిక్లరేషన్‌కు ప్రతిస్పందనగా డాక్టర్ వీర్ సింగ్ భట్టి ఒక కరపత్రాన్ని ప్రచురించినప్పుడు ఈ పదాన్ని తొలిసారి ఉపయోగించారు. సిక్కుల కోసం ప్రత్యేక దేశం అనే డిమాండ్ 1929 నుండి మొదలయ్యింది. కాంగ్రెస్ సమావేశంలో మాస్టర్ తారా సింగ్ ఈ డిమాండ్‌ను తొలిసారి లేవనెత్తారు.
ఖలిస్తానీ ఉద్యమ నాంది..
70వ దశకంలో చరణ్ సింగ్ పంక్షి, డాక్టర్ జగదీత్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో ఖలిస్తాన్ కోసం డిమాండ్ మరింత తీవ్రమైంది. దీని తరువాత 1980లో ఖలిస్తాన్ నేషనల్ కౌన్సిల్ కూడా ఏర్పాటయ్యింది. అనంతరకాలంలో పంజాబ్‌లోని కొంతమంది యువకులు దాల్ ఖల్సా అనే సంస్థను స్థాపించారు. ఇదిలావుండగా ఉగ్రవాదులను అంతం చేసేందుకు 1984లో అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో ఆపరేషన్ బ్లూ స్టార్‌ను నిర్వహించారు. దీని తరువాత ఖలిస్తానీ ఉద్యమ మూలాలు భారతదేశం నుండి దూరమయ్యాయి.
ఇప్పుడు అమెరికా, కెనడా, బ్రిటన్‌తో సహా అనేక దేశాలలో ఖలిస్తాన్ మద్దతుదారులు భారతదేశానికి వ్యతిరేకంగా తరచూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. విదేశాలలో ఉంటూ, భారత గడ్డపై అశాంతిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: టెండర్ ఓటింగ్ అంటే ఏమిటి? ఎన్వలప్‌లో ఓటు ఎందుకు ప్యాక్ చేస్తారు?
Comments
Please login to add a commentAdd a comment