విద్యుత్ అంతరాయంతో అంధకారంలో 30 లక్షల మంది
టోర్నడోల ధాటికి ఐదుగురు మృతి
ఇంకా ముప్పు పొంచి ఉందన్న అధికారులు
మిల్టన్ తుఫాను ఫ్లోరిడాలో బీభత్సం సృష్టించింది. భయంకరమైన గాలులు, వర్షంతో నగరాలను అతలాకుతలం చేసింది. సెయింట్ లూసీ కౌంటీలో టోర్నడోల ధాటికి ఐదుగురు మరణించారు. విద్యుత్ లేక 30 లక్షల మంది అంధకారంలో ఉండిపోయారు. బుధవారం రాత్రి 3 కేటగిరీగా తీరం దాటిన తుఫాను తరువాత ఒకటో కేటగిరీకి బలహీనపడింది. అయినా ముప్పు ఇంకా పొంచి ఉందని అధికారులు పునరుద్ఘాటించారు.
టంపా: మిల్టన్ ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు ఫ్లోరిడా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. గంటకు 205 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. బుధవారం ఉదయం దక్షిణ ఫ్లోరిడాలోని కొన్ని ప్రాంతాల్లో టోర్నడోలు సంభవించాయి. సెయింట్ లూసీ కౌంటీలో టోర్నడోల ధాటికి ఐదుగురు మృతి చెందారు. ఫ్లోరిడా అట్లాంటిక్ తీరంలోని ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఫోర్ట్ మైయర్స్‌లో మరో టోర్నడో ధాటికి చెట్లు కూలిపోయాయి.
విద్యుత్ స్థంభాలు నేలకొరగడంతో రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షల మంది అంధకారంలో ఉండిపోయారు. హార్డీ కౌంటీ, హైలాండ్స్ కౌంటీతో సహా పలు ప్రదేశాల్లో 90% మందికి విద్యుత్ అంతరాయం కలిగింది. సానిబెల్ నగరంలో రోడ్లన్నీ వరదతో ముంచెత్తాయి. రహదారులపై 3 అడుగుల మేర నీరు చేరింది. వరదలతో టంపా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. నేపుల్స్‌లో రికార్డు స్థాయిలో నీరు నిలిచింది. తుఫాను ధాటికి తీవ్ర ప్రాణ నష్టం జరిగి ఉంటుందని, అయితే ఎంత మంది చనిపోయారనేది చెప్పలేమని అధికారులు వెల్లడించారు.
అత్యధిక వర్షపాతం...
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 41 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వెయ్యేళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం. ఈదురు గాలులు ట్రోపికానా ఫీల్డ్ పైకప్పును చీల్చాయి. తుపాను ధాటికి పలు క్రేన్లు కూడా కూలిపోయాయి. మంచి నీటి సరఫరాను సైతం నిలిపేశారు. సుదీర్ఘ విద్యుత్ అంతరాయాలు, మురుగునీటి పారుదల వ్యవస్థ సైతం మూతపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓర్లాండోలో వాల్ డిస్నీ వరల్డ్, యూనివర్సల్ ఓర్లాండో, సీ వరల్డ్ సంస్థలు గురువారం మూతపడ్డాయి. పలు ఫ్లోరిడా విమానాశ్రయాలను నిరవధికంగా మూసివేశారు. హరికేన్ కలిగించిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
పొంచి ఉన్న ముప్పు..
హెలెన్ హరికేన్‌తో ఇప్పటికే దెబ్బతిన్న ఫ్లోరిడాను మిల్టన్ మరింత దుస్థితిలోకి తీసుకెళ్లింది. ఈ ఏడాది అమెరికాను తాకిన ఐదో హరికేన్ ఇది. ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీరానికి 75 మైళ్ల దూరంలో మిల్టన్ కేంద్రీకృతమై ఉందని నేషనల్ హరికేన్ సెంటర్ (ఎన్‌హెచ్‌సీ)తెలిపింది. దీని ప్రభావంతో తూర్పు మధ్య, ఈశాన్య ఫ్లోరిడాలో ఈదురుగాలులు వీస్తాయని, ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ కరోలినా తూర్పు తీరం వెంబడి తుఫాను ముప్పు ఇంకా ఉందని వెల్లడించింది.
అధికారులు ఫ్లోరిడా, ఇతర రాష్ట్రాలకు చెందిన 9,000 మంది నేషనల్ గార్డ్ సభ్యులతో సహాయక చర్యలు చేపట్టారు. కాలిఫోరి్నయా వరకు 50,000 మందికి పైగా యుటిలిటీ కారి్మకులను అందుబాటులో ఉంచారు. టంపా, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని 60 శాతానికి పైగా గ్యాస్ స్టేషన్లలో బుధవారం రాత్రే గ్యాస్ నిండుకోవడంతో గ్యాసోలిన్ ట్యాంకర్లను తరలించడానికి సైరన్లతో హైవే పెట్రోలింగ్ కార్లు పనిచేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment