న్యూయార్క్: భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌తో గురువారం భేటీ కానున్నారు. భారత్-కెనడా మధ్య వివాదం కొనసాగుతున్న వేళ వీరి సమావేశం ప్రధాన్యత సంతరించుకుంది. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో ఇరుదేశాల మధ్య చెలరేగిన వివాదం చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఈ భేటీ వెనక ఉన్న ఉద్దేశాన్ని మాత్రం వెల్లడించలేదు అధికార వర్గాలు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందా..? ప్రశ్నించినప్పుడు.. ఈ వ్యవహారంలో కెనడాకు సహకరించాలని భారత్‌ను ఇప్పటికే కోరినట్లు యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ స్పష్టం చేశారు. కెనడా, భారత్ రెండు దేశాలు సహకరించుకోవాలని విజ్ఞప్తి చేశామని ఆయన చెప్పారు. భారత్‌తో సంబంధాలు పెంచుకోనున్న నేపథ్యంలో నిజ్జర్ హత్య కేసులో కెనడాకు అమెరికా మద్దతుగా నిలవడంలేదనే ఆరోపణలు కూడా వచ్చాయి.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. నిరాధారమైన ఆరోపణలను భారత్ ఖండించింది. అనంతరం ఇరుదేశాలు ఆంక్షల దిశగా అడుగులు వేశాయి. ఈ కేసులో భారత్‌పై ఒత్తిడి పెంచడంలో అమెరికా విఫలమైందనే ఆరోపణలు కూడా వచ్చాయి. భారత్‌తో సంబంధాలు పెంచుకునే నేపథ్యంలోనే కెనడాను పక్కకు పెడుతోందని వాదనలు వెలువడ్డాయి. ఈ క్రమంలో భారత్ దర్యాప్తుకు సహకరించాలని అమెరికా కోరింది.
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు హాజరైన విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్.. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి బ్లింకెన్‌తో అనధికారికంగా ఇప్పటికే ఒకసారి కలిశారు.కానీ కెనడా-భారత్ వివాదం చర్చకు రాలేదని తెలుస్తోంది. న్యూయార్క్‌లో జరిగిన క్వాడ్ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు రాలేదని మిల్లర్ తెలిపారు.
ఇదీ చదవండి: చైనాపై నిరసనల హోరు.. జిన్‌పింగ్ దిష్టిబొమ్మ దహనం
Comments
Please login to add a commentAdd a comment