న్యూయార్క్: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై కెనడా ఆరోపణల్లో ఎలాంటి వివాదం కనిపించట్లేదని ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ (ASIO) డైరెక్టర్ మైక్ బర్గెస్ అన్నారు. కాలిఫోర్నియాలోని ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ భాగస్వాముల చారిత్రాత్మక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక దేశ పౌరుని హత్య విషయంలో మరో దేశం జోక్యం చేసుకోవడం తీవ్రమైన అంశమని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలకు ఏ దేశం పాల్పడకూడదని చెప్పారు.
భారత ఏజెంట్ల తర్వాతి లక్ష్యం ఆస్ట్రేలియానేనా అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. అలా అని తాను ఊహించలేనని చెప్పారు. కెనడాలో జరిగిన విషయం ఆస్ట్రేలియా వరకు వస్తుందని చెప్పలేమని అన్నారు. ఇతర దేశ ప్రభుత్వం తమ దేశంలో జోక్యం చేసుకుంటే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులకు పాల్పడుతున్న అతివాదులకు భారత్ నుంచి ముప్పు ఉంటుందని భావిస్తున్నారా..? అని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. అది వారినే అడగాలని దాటవేశారు.
కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల ఆరోపించారు. తమ దేశ పౌరుని హత్యలో ఇతర దేశ ప్రమేయం తగదని హెచ్చరికలు చేసింది. ఇది ఇరుదేశాల మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది.
ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలతోపాటు వీసా రద్దు వంటి కఠిన చర్యలు తీసుకున్నాయి. ఈ కేసు విచారణలో భారత్ సహకరించేలా ఒప్పించేట్లు ప్రపంచదేశాల నుంచి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా కెనడా చేసింది. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని భారత్ వాదించింది.
ఇదీ చదవండి: పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో ఆందోళనలు
Comments
Please login to add a commentAdd a comment