ప్రపంచవ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న పాపులారిటీ గురించి.. పలు దేశాలు ఆయనకిచ్చే గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో.. భారీ నష్టం జరగకుండా ఆయన చూపించిన చొరవ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ఉక్రెయిన్‌పై అణు బాంబును వేయాలనుకున్న రష్యా ప్రయత్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆపారట!. ఈ విషయాన్ని ఇద్దరు అమెరికా భద్రతాధికారులు వెల్లడించినట్లు ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రచురించింది. ‘‘2022లో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం మొదలయ్యాక కొన్నిరోజులకు రష్యా బలగాలకు ఒకదాని వెంట ఒకటి ఎదురు దెబ్బలు తగిలాయి. ఆ సమయంలో కీవ్ నగరం(ఉక్రెయిన్ రాజధాని)పై అణు బాంబు దాడికి రష్యా దిగబోతోందన్న సమాచారం అమెరికాకు చేరింది. అలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. మిత్రపక్షంకాని దేశాలతో పాటు భారత్ సహాకారాన్ని కోరింది అగ్రరాజ్యం.
.. భారత్, చైనా సహా పలు దేశాలు అణు బాంబు ప్రయోగించాలనే ప్రయత్నాలను విరమించుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి చేశాయి. దీంతో ఆయన వెనక్కి తగ్గారు. అలా తీవ్ర సంక్షోభం తలెత్తకుండా నివారించడంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర దేశాల నుండి వచ్చిన సహకారం కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది’’ అని ఆ అధికారులిద్దరూ చెప్పినట్లు సదరు మీడియా కథనం పేర్కొంది.
ఇదిలా ఉంటే.. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో.. తొలి నుంచి తటస్థ వైఖరి అవలంభిస్తూనే.. మానవ హక్కుల ఉల్లంఘనల చర్యలను ఖండిస్తోంది భారత్. అంతేకాదు ఈ సంక్షోభ ముగింపునకు శాంతియుత చర్చలే పరిష్కారమని చెబుతూ వస్తోంది. ఇక ఉజ్బెకిస్తాన్ వేదికగా కిందటి ఏడాదిలో జరిగిన ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు (షాంఘై సహకార సంఘం) సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ సమయంలో ‘‘ఇది యుద్ధాల శకం కాదు’’ అని ప్రధాని మోదీ సూచించిన సంగతి తెలిసిందే. భారత్ వేదికగా జరిగిన జీ20 సమ్మిట్‌లోనూ ఈ ప్రకటన హైలైట్ కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment