వాషింగ్టన్‌లో లాయిడ్ ఆస్టిన్‌తో కలిసి వెళ్తున్న జైశంకర్
వాషింగ్టన్: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ శుక్రవారం వాషింగ్టన్‌లో అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌తో సమావేశయ్యారు. ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. భారత్–అమెరికా మధ్య వ్యూహాత్మక, రక్షణ భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయానికొచ్చారు. రెండు దేశాలకు రక్షణపరంగా ఎదురవుతున్న సవాళ్ల గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. లాయిడ్ అస్టిన్‌తో సమావేశమై, కీలక అంశాలపై సంప్రదింపులు జరిపినట్లు జైశంకర్ పేర్కొన్నారు.
జాతీయ భద్రత సలహాదారుతో భేటీ
శంకర్ గురువారం అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సాలివన్‌తో సమావేశమయ్యారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై వారు చర్చించారు. కరోనా మహమ్మారి అంతం, కోవిడ్ వ్యాక్సినేషన్, స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతం, వాతావరణ మార్పుపై పోరు, అఫ్గానిస్తాన్‌లో శాంతి.. తదితర అంశాలపై ఇరువురు లోతుగా చర్చించారు. ఇరు దేశాలు ఎదుర్కొంటున్న ఉమ్మడి సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ దేశం సందర్శించిన తొలి విదేశీ విదేశాంగ మంత్రి జైశంకర్ కావడం విశేషం. జేక్ సాలివన్‌తో భేటీ కావడం సంతోషదాయకమని అనంతరం జై శంకర్ ట్వీట్ చేశారు.
రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు, ఉమ్మడిగా పాటించే విలువలు ఇండో యూఎస్ భాగస్వామ్యానికి పునాదులని సమావేశం అనంతరం జేక్ ట్వీట్ చేశారు. కోవిడ్‌పై పోరు కోసం ఇటీవలి కొన్ని వారాల్లోనే అమెరికా ప్రభుత్వం, అక్కడి సంస్థలు, ఆ దేశ పౌరులు దాదాపు 50 కోట్ల డాలర్ల విలువైన సాయం భారత్‌కు అందించారని అమెరికా జాతీయ భద్రత మండలి అధికార ప్రతినిధి ఎమిలీ హార్నీ తెలిపారు. అమెరికాలోని పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలకు చెందిన శక్తిమంతమైన రాజకీయ నాయకులతో జైశంకర్ భేటీ అయ్యారు. అమెరికాకు భారత్ 9వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. రెండుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువ, ఈ ఏడాది జనవరి నుంచి మార్చ్ వరకు, 24.8 బిలియన్ డాలర్లు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment