మనిషి తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదంటారు పెద్దలు. కానీ, గొప్ప విజయాలు ఆగిపోయేది ప్రయత్న లోపం వల్లే!. అది గ్రహించిన ఓ వ్యక్తి.. కష్టంతో తాను అనుకున్నది సాధించాడు. అదీ ఏడు నెలల కఠోర సాధన.. ఇంటికి, స్నేహితులకు దూరంగా అజ్ఞాతవాసంలో ఉంటూ!
ఐర్లాండ్ కోర్క్‌కు చెందిన బ్రయాన్ ఓ కీఫ్ఫె.. పాతికేళ్ల ఈ యువకుడు అతిబరువు సమస్యతో బాధపడేవాడు. 2021లో అతని బరువు అక్షరాల 154 కేజీలు. బరువు తగ్గేందుకు అతగాడు ఎంతో ప్రయత్నించాడు. ఏదీ వర్కవుట్ కాలేదు. అసలు సమస్య ఏంటో అతనికి అర్థమైంది. అది ఇంటి ఫుడ్.. తాను ఎలా ఉన్నా ఫర్వాలేదనుకుంటూ అభిమానించే అయినవాళ్లు. వెంటనే అందరికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దేశం విడిచాడు. సముద్రాలు దాటాడు.. స్పెయిన్‌కు చేరుకున్నాడు. బరువు బాగా తగ్గిపోవాలి. అతని ముందు ఒకే ఒక్క టార్గెట్. ఆ లక్ష్య సాధనలో కఠోర ప్రయత్నాలకు దిగాడు.
ఏడు నెలలపాటు విరామం లేకుండా వ్యాయామాలు చేశాడు. ఆ క్రమంలో ఎన్నో గాయాలు. అయినా ప్రయత్నం ఆపలేదు. వాకింగ్, రన్నింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్.. ఇలా అన్నింటిని ప్రయత్నించాడు. నెమ్మది నెమ్మదిగా వర్కవుట్లకు సమయం పెంచుకుంటూ పోయాడు. ఒకానొక టైంలో భారీ కాయంతోనే ఐదు కిలోమీటర్లను 35 నిమిషాల్లోపు పూర్తి చేశాడు కూడా. మరోవైపు బ్రయాన్ డైట్‌లోనూ ఎన్నో మార్పుల చేసుకున్నాడు. కేలరీలను తగ్గించుకున్నాడు. రోజుకు ఐదు గంటలపాటు వ్యాయామం చేసే స్టేజ్‌కి చేరాడు. ఏడు నెలల కఠోర ప్రయత్నం తర్వాత అతని బరువు 91 కేజీలకు చేరింది.
అంటే.. 63 కేజీల బరవు తగ్గాడన్న మాట. ఆ రూపాన్ని అద్దంలో చూసుకుని మురిసిపోయాడు అతను. ఈ ఏడు నెలల కాలంలో తల్లిదండ్రులకు, స్నేహితులకు దూరంగా ఉన్నాడతను. కేవలం క్షేమసమాచారాలను ఫోన్ ద్వారా తెలియజేశాడే తప్ప.. వాళ్లతో వీడియో కాల్స్ సంభాషణలు, తాను ఎలా కష్టపడుతున్నాడనేది చూపించే ప్రయత్నం చేయలేదు. ఎందుకు వాళ్లను వీడాడో అసలు కారణమే చెప్పలేదట!.
ఏడు నెలల తర్వాత బరువు తగ్గిన బ్రయాన్ ఇంటికి చేరాడు. బరువు తగ్గిన అతని రూపం.. ఇంట్లో వాళ్లను షాక్‌కు గురి చేసింది. స్నేహితులను సర్‌ప్రైజ్ చేసింది. ఆనందం పట్టలేకపోయారంతా. ఇప్పుడు బ్రయాన్.. తగ్గిన బరువును అలాగే కొనసాగించే ప్రయత్నంలో ఉన్నాడు. అంతేకాదు.. తన ప్రయత్నాలను వివరిస్తూ తనలాంటి మరికొందరికి సోషల్ మీడియా ద్వారా సలహాలు ఇస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment