పాలస్తీనా స్వతంత్ర దేశం | Sakshi
Sakshi News home page

పాలస్తీనా స్వతంత్ర దేశం

Published Thu, May 23 2024 5:26 AM

Israel-Hamas war: Norway, Ireland, Spain recognizing independent Palestinian state

అధికారికంగా గుర్తిస్తున్నాం..   

నార్వే, ఐర్లాండ్, స్పెయిన్‌ కీలక ప్రకటన  

టెల్‌ అవీవ్‌: పాలస్తీనా విషయంలో నార్వే, ఐర్లాండ్, స్పెయిన్‌ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని తాము గుర్తిస్తున్నామని బుధవారం ప్రకటించాయి. ఈ నెల 28న ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నాయి. నార్వే, ఐర్లాండ్, స్పెయిన్‌ దేశాల తాజా ప్రకటనను పాలస్తీనియన్లు స్వాగతించారు. పాలస్తీనా దేశాన్ని ఇప్పటికే భారత్‌ సహా దాదాపు 140 దేశాలు అధికారికంగా గుర్తించాయి. అంటే ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగిన మొత్తం దేశాల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ దేశాలు పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. తాజాగా మరో మూడు దేశాలు ఈ జాబితాలో చేరడం విశేషం.  

శాంతి, సామరస్యం కోసమే..   
తూర్పు జెరూసలేం, వెస్ట్‌ బ్యాంక్, గాజా స్ట్రిప్‌ను కలిపి ప్రత్యేక పాలస్తీనాను దేశంగా గుర్తించాలని లక్షలాది మంది పాలస్తీనియన్లు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. 1967లో జరిగిన మిడిల్‌ఈస్ట్‌ యుద్ధంలో ఆ మూడు ప్రాంతాలను ఇజ్రాయెల్‌ ఆక్రమించుకుంది. ప్రస్తుతం తూర్పు జెరూసలేం, వెస్ట్‌ బ్యాంక్, గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ నియంత్రణ కొనసాగుతోంది. పాలస్తీనా దేశాన్ని గుర్తించకపోతే మధ్యప్రాచ్యంలో శాంతి, సామరస్యం నెలకొల్పడం సాధ్యం కాదని నార్వే ప్రధాని జోనస్‌ గహర్‌ పేర్కొన్నారు. ఐర్లాండ్‌కు, పాలస్తీనాకు ఇదొక చరిత్రాత్మకమైన, ముఖ్యమైన రోజు అని ఐర్లాండ్‌ ప్రధాని సైమన్‌ హ్యారిస్‌ వ్యాఖ్యానించారు.  తమ నిర్ణయం ఇజ్రాయెల్‌సహా ఎవరికీ వ్యతిరేకం కాదని స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ స్పష్టంచేశారు.   

హంతకులకు, రేపిస్టులకు బంగారు పతకాలా?   
పాలస్తీనాను ఒకదేశంగా గుర్తిస్తూ నార్వే, ఐర్లాండ్, స్పెయిన్‌ చేసిన ప్రకటన పట్ల ఇజ్రాయెల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు దేశాల నుంచి తమ రాయబారులను వెనక్కి పిలిపించింది. తమ దేశంలో ఉన్న నార్వే, ఐర్లాండ్, స్పెయిన్‌ దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసింది. తద్వారా తమ నిరసనను తెలియజేసింది. హమాస్‌ హంతకులకు, రేపిస్టులకు నార్వే, ఐర్లాండ్, స్పెయిన్‌ బంగారు పతకాలు బహూరిస్తున్నాయని, ఈ పరిణామాన్ని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి కట్జ్‌ పేర్కొన్నారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement