డబ్లిన్: మనిషికి ఎల్లవేళలా రుచికరమైన ఆహారమే ప్రీతికరమైంది. తర్వాతే మిగతా పనీ పాట. ‘ఏం చేసినా దీని కోసమే కదా గురూ’ అని టైమ్‌కి క్యారేజ్‌ను ఓపెన్ చేసే పని సంస్కృతి బహుశా ఒక్క ఇండియాదే కాకపోవచ్చు. క్యారేజ్‌లు లేనివాళ్లకు నడిచి వెళ్తే ‘సబ్ వే’లు, నడవడం చేతకాకపోతే స్విగ్గీలు ఎలాగూ ఉంటాయి. ఏమైనా ప్రపంచ ప్రజలకు వేళకు తిండిపై ధ్యాస పెరిగి, ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గుతోంది! పౌరులపై పౌరులకు శ్రద్ధ తగ్గినప్పుడు ఆ శ్రద్ధ బాధ్యతను కూడా ప్రభుత్వాలే కదా తిండి మానేసైనా తీసుకోవలసింది. మన దేశంలోనే చూడండి.. తినే వాటి విషయంలో ముఖ్యమైనవేమీ మనం పట్టించుకోము కదా.. ప్రభుత్వం పట్టించుకుంది. ‘బెస్ట్ బిఫోర్’ డేట్ లేకుండా చిన్న స్వీట్ ముక్కను కూడా అమ్మడానికి లేదని ఈ ఫస్ట్ నుంచి చట్టాన్ని తెచ్చింది. అలా ప్రజల ఆరోగ్య భద్రతను తన మీద కొంత ఉంచుకుని, మిగతా కొంత అమ్మేవాళ్ల మీద పెట్టింది.
పౌరుల షుగర్ విషయంలో ఐర్లాండ్ ప్రభుత్వం మనకన్నా మరికాస్త శ్రద్ధగా ఉంది. అమెరికన్ తినుబండారాల గొలుసు కంపెనీ ‘సబ్ వే’ విక్రయిస్తున్న బ్రెడ్డులో పిసరంత షుగర్ ఎక్కువైందని సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. కోర్టు తక్కిన కేసులన్నీ పక్కకు నెట్టేసి సబ్ వే బ్రెడ్డు కేసును విచారించింది. పిసరంతే కదా అని తినేవాళ్లు అనుకోవచ్చు. సుప్రీంకోర్టుకు ఆ పిసరంత టూ మచ్ అనిపించింది. ‘చక్కెర పాళ్లు ఎక్కువగా ఉన్నాయి కనుక ఇది ముఖ్య ఆహారం (స్టేపుల్ ఫుడ్) అవదు. ముఖ్య ఆహారం కాదు కనుక దీనికి జీరో పర్సెంట్ వ్యాట్ వర్తించదు’ అని తీర్పు ఇచ్చింది. దీనర్థం ఏమిటి? ఆ బ్రెడ్డు తినకపోయినా ఆత్మారాముడు ఏమీ హర్ట్ అవడు, తిని షుగర్ తెచ్చుకుని తిప్పలు పడకండి అని చెప్పడం. చెబితే పౌరులు వినడం లేదు కాబట్టి.. షుగర్ తగ్గించకపోతే వ్యాట్ పడుతుంది జాగ్రత్త అని ‘సబ్ వే’ ను కోర్టు వారి ద్వారా లైన్‌లో పెట్టించింది ఐర్లాండ్ ప్రభుత్వం.
Comments
Please login to add a commentAdd a comment