టెల్ అవీవ్: ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం కుదిరింది. 50 మంది బందీలను కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ నాలుగు రోజుల కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ కేబినెట్ తీర్మాణాన్ని ఆమోదించింది. హమాస్‌తో యుద్ధం ప్రారంభమైన నాటినుంచి కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించడం ఇదే మొదటిసారి.
ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారిలో మహిళలు, పిల్లలను కాపాడుకోవడానికి ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. ప్రతి రోజూ 12 మంది చొప్పున విడుదల చేసేలా అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.
అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇందుకు అంగీకరించింది. తమ చెరలో ఉన్న పాలస్తీనా మహిళలు, పిల్లలను విడుదల చేయడానికి కూడా ఇజ్రాయెల్ ఒప్పుకుంది. గాజాకు అధిక మొత్తంలో ఇంధన, మానవతా సాయం అందడానికి కూడా అనుమతించింది. అటు.. హమాస్ చెరలో దాదాపు 240 మంది ఇజ్రాయెల్ వాసులు బందీలుగా ఉన్నారు. ఇందులో 40 మంది చిన్నారులు కూడా ఉన్నారని హమాస్ పేర్కొంది. ఒప్పందం ప్రకారం గాజాపై దాడులు తాత్కాలికంగా నిలిపివేస్తామని ఇజ్రాయెల్ అధికారి తెలిపారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. హమాస్‌ను అంతమొందించాలనే ధ్యేయంతో ఇజ్రాయెల్ పాలస్తీనాపై ఎడతెరిపిలేని యుద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఉత్తర గాజాను పూర్తిగా ఖాలీ చేయించింది. ప్రస్తుతం దక్షిణ గాజాపై యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్‌వైపు 1200 మంది మరణించారు. పాలస్తీనా వైపు 12,700 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: బందీలకు ఇక విముక్తి!
Comments
Please login to add a commentAdd a comment