![Israel Calls for Resignation of UN Chief - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/25/uno.jpg.webp?itok=iBfnzsMM)
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం మొదలై ఇప్పటికే 19 రోజులు దాటింది. ఈ దాడుల్లో మృతుల సంఖ్య ఏడువేలు దాటింది. ప్రపంచమంతా ఈ యుద్ధాన్ని గమనిస్తోంది. ఐక్యరాజ్యసమితి (యూఎన్‌ఓ)లో కూడా ఈ యుద్ధంపై చర్చలు జరుగుతున్నాయి. వీటినడుమ ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిన్నారులు, మహిళలు, వృద్ధులపై హమాస్ సాగిస్తున్న దారుణాలపై ఆంటోనియో గుటెర్రెస్ ఉపేక్ష వహిస్తున్నట్టు కనిపిస్తున్నారని, అందుకే ఆయన ఐక్యరాజ్యసమితికి నాయకత్వం వహించడానికి తగినవారు కాదని ఎర్డాన్ ఆరోపించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఇజ్రాయెల్, యూదు ప్రజలపై దురాగతాలకు తెగబడుతున్న వారిపై సానుభూతి తెలిపేవారితో తాను మాట్లాడటంలో అర్థం లేదని అన్నారు.
కాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ, హమాస్ ఎటువంటి కారణం లేకుండా దాడులు చేసి ఉండదని తెలుసుకోవడం కూడా ముఖ్యమేనని అన్నారు. పాలస్తీనా ప్రజలు 56 ఏళ్లుగా దురాక్రమణలను ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ హమాస్ దాడులను సమర్థించలేమని కూడా ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: భారత్ నుంచి గాజాకు 38 టన్నుల ఆహార పదార్థాలు, వైద్య పరికరాలు!
Comments
Please login to add a commentAdd a comment