హనియే హత్య వెనక మతిపోయే ప్లాన్
రెణ్నెల్ల ముందే అమర్చిన ఇజ్రాయెల్
గదిలోకి వెళ్తూనే రిమోట్‌తో పేలి్చవేత
‘జింకను వేటాడేప్పుడు పులి ఓపికగా ఉంటది. అదే పులినే వేటాడాల్సొస్తే?! ఇంకెంత ఓపిక కావాలి?’ ఇది ఓ సినిమాలోని డైలాగ్. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేపై దాడి కోసం ఇజ్రాయెల్ నిఘా విభాగం మొసాద్ కూడా అచ్చం అలాగే ఓపిక పట్టింది.
అది కూడా ఒక రోజో, రెండ్రోజులో కాదు.. ఏకంగా రెండు నెలలకు పైగా! ఆయన బస చేస్తారని భావించిన ఇంట్లో అప్పటికే బాంబు అమర్చి ఉంచింది. ఏ బెడ్రూంలోకి వెళ్తాడో పక్కాగా తెలుసుకుని మరీ అందులోనే బాంబును సిద్ధం చేసి పెట్టింది. అలా హనియే కోసం ముందస్తుగానే కాచుకుని కూచున్న మృత్యువు, సమయం రాగానే అమాంతంగా మింగేసింది...!
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో గత బుధవారం తెల్లవారుజామున జరిగిన పేలుడులో హనియే మరణించారు. అత్యంత కచి్చతత్వంతో కూడిన ఇజ్రాయెల్ క్షిపణి దాడే అందుకు కారణమని తొలుత వార్తలొచ్చాయి. క్షిపణిలాంటి వస్తువేదో హనియే గది కిటీకిని తాకడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారని కొందరు చెప్పారు. అది క్షిపణి దాడేనని ఇరాన్ కూడా ఆరోపించింది.
టెహ్రాన్‌లో కట్టుదిట్టమైన రక్షణలో ఉండే గెస్ట్ హౌస్‌ను హనియేకు కేటాయించారు. అలాంటి గెస్ట్ హౌస్‌పై సుదూరం నుంచి అంతటి కచి్చతత్వంతో క్షిపణి దాడి సాధ్యమేనా? పైగా క్షిపణి దాడితో భారీ విధ్వంసం జరుగుతుంది. కానీ ఆ గెస్ట్ హౌస్‌కు అంతటి నష్టమేమీ జరగలేదు. గది, పరిసర భాగాలే బాగా దెబ్బతిన్నాయి. అదే భవనంలో పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ నాయకుడు జియాద్ అల్ నఖలా బస చేసిన పక్క గది కూడా దెబ్బ తినలేదు. కనుక ఎలా చూసినా జరిగింది క్షిపణి దాడి కాదు.
వామ్మో ఇజ్రాయెల్!
హనియే మృతికి గది లోపలి పేలుడే కారణమని ఇరాన్ అధికారులు ఎట్టకేలకు గుర్తించారు. ఆ గదిలో రెండు నెలల కిందే బాంబు పెట్టారని తెలుస్తోంది. ఇరాన్ భద్రతలోని లోపాలనే అందుకు అనువుగా మార్చుకున్నారు. బాంబు పెట్టి రెండు నెలలపాటు ఓపికగా నిరీక్షించారు. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు హనియే టెహ్రాన్ చేరుకున్నారు. అది ముగిశాక గెస్ట్‌హౌస్‌కు చేరుకుని ఆ గదిలోకే వెళ్లినట్టు పక్కాగా నిర్ధారించుకున్న తర్వాతే రిమోట్‌తో బాంబు పేల్చారు.
పేలుడు ధాటికి భవనం ఒక్కసారిగా కదిలిపోయింది. గోడలో కొంత భాగం కూలింది. కిటికీలు పగిలాయి. పేలుడు తీవ్రతకే హనియే మృతి చెందారు. ఈ కోవర్ట్ ఆపరేషన్ వివరాలన్నింటినీ పాశ్చాత్య అధికారులతో మొసాద్ పంచుకుందని న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక పేర్కొంది. దేశం వెలుపల రాజకీయ ప్రత్యర్థులు తదితర టార్గెట్ల ఏరివేతకు మొసాద్ పాల్పడుతోంది. ఇజ్రాయెల్‌పై హమాస్ అక్టోబర్ 7 దాడుల తర్వాత దాని అగ్ర నేతలందరినీ వేటాడతామని ప్రధాని నెతన్యాహూతో పాటు మొసాద్ చీఫ్ డేవిడ్ బరి్నయా కూడా ప్రతిజ్ఞ చేశారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment