అతి శక్తిమంతమైన ఆయుధాలు. అంతకు మించిన నిఘా సంపత్తి. అవడానికి చిన్న దేశమే అయినా సైనిక సంపత్తిలో మాత్రం ఇజ్రాయెల్ అక్షరాలా అమేయ శక్తే.
హమాస్ పని పట్టేందుకు గాజా స్ట్రిప్ వద్దే ప్రస్తుతం ఏకంగా 3 లక్షల మంది సైనికులను మోహరించింది! గాజాపై భూతల దాడికి ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోందనేందుకు ఇది కచి్చతమైన సంకేతమేనని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా అమెరికా నుంచి అన్నివిధాలా అందుతున్న సాయంతో ఇజ్రాయెల్ సైనికంగా తేరిపార చూడలేనంతగా బలోపేతమైంది. మధ్యప్రాచ్యంలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఆ దేశం పూర్తిగా సహకరిస్తుందని అమెరికా భావించడమే ఇందుకు కారణం...
సైనిక శక్తియుక్తులను ఎప్పటికప్పుడు పెంచుకునేందుకు, నిరంతరం అప్రమత్తంగా ఉండేందుకు ఇజ్రాయెల్ అత్యంత ప్రాధాన్యమిస్తుంది. ఆ దేశంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ విధిగా సైన్యంలో చేరాల్సిందే. పురుషులు కనీసం 32 నెలల పాటు, మహిళలు రెండేళ్ల పాటు సైన్యంలో పని చేయాలి. ఇవిగాక అణు సామర్థ్యం కూడా ఇజ్రాయెల్ సొంతమని చెబుతారు. అణు వార్ హెడ్లను మోసుకెళ్లగల జెరిషో మిసైళ్లు, విమానాలు ఆ దేశం వద్ద ఉన్నాయి.
అతి పెద్ద ఆయుధ ఎగుమతిదారు
తొలినాళ్లలో సైనిక అవసరాలకు ప్రధానంగా దిగుమతుల మీదే ఆధారపడ్డ ఇజ్రాయెల్, చూస్తుండగానే సంపన్న దేశాలకు కూడా అత్యాధునిక ఆయుధాలు, ఆయుధ, నిఘా వ్యవస్థలు తదితరాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది!
► 2018–22 మధ్య కనీసం 35 దేశాలు ఇజ్రాయెల్ నుంచి 320 కోట్ల డాలర్ల పై చిలుకు విలువైన ఆయుధాలను దిగుమతి చేసుకున్నాయి.
► వీటిలో ఏకంగా మూడో వంతు, అంటే 120 కోట్ల డాలర్ల మేరకు ఆయుధాలను భారతే దిగుమతి చేసుకుంది.
► ఆ ఐదేళ్ల కాలంలో ఇజ్రాయెల్ ఆయుధ దిగుమతులు 270 కోట్ల డాలర్లకు చేరాయి. ఇవన్నీ కేవలం అమెరికా, జర్మనీ నుంచే కావడం విశేషం! అందులోనూ 210 కోట్ల డాలర్ల దిగుమతులు ఒక్క అమెరికా నుంచే జరిగాయి!
ఇంజనీరింగ్ అద్భుతం.. ఐరన్‌డోమ్
ఐరన్ డోమ్. ఇజ్రాయెల్ ఏళ్ల తరబడి శ్రమించి రూపొందించిన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. స్వల్పశ్రేణి రాకెట్లను రాడార్ టెక్నాలజీ సాయంతో అడ్డగించి తుత్తునియలు చేయగల సామర్థ్యం దీని సొంతం...
► హెజ్బొల్లా తొలిసారి ఇజ్రాయెల్‌పై ఏకకాలంలో వేలకొద్దీ రాకెట్లతో దాడి చేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని 2006లో ఐరన్ డోమ్ నిర్మాణానికి ఆ దేశం తెర తీసింది.
► ఇది 2011లో వాడకంలోకి వచి్చంది.
► 2021 మొత్తంలో హమాస్, ఇతర పాలస్తీనా మిలిటెంట్ గ్రూపులు ప్రయోగించిన రాకెట్లలో 90 శాతానికి పైగా ఐరన్‌డోమ్ నిర్వీర్యం చేసి సత్తా చాటింది.
► డోమ్ నిర్మాణానికి అమెరికా ఎంతగానో సాయం చేసింది.
► 1946–2023 మధ్య ఏకంగా 12,400 కోట్ల డాలర్ల విలువైన సైనిక, రక్షణపరమైన సాయాన్ని అమెరికా నుంచి ఇజ్రాయెల్ అందుకుంది!!
► అమెరికా తన 2022 బడ్జెట్‌లో కేవలం ఇజ్రాయెల్‌కు మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ నిమిత్తమే ఏకంగా 150 కోట్ల డాలర్లు కేటాయించింది! – పదేళ్లలో ఇజ్రాయెల్‌కు ఏకంగా 3,800 కోట్ల డాలర్ల మేరకు సైనికపరంగా నిధులు అందించేందుకు 2016లో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది!
► పదేళ్లలో ఇజ్రాయెల్‌కు ఏకంగా 3,800 కోట్ల డాలర్ల మేరకు సైనికపరంగా నిధులు అందించేందుకు 2016లో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది!
రక్షణపై భారీ వ్యయం
చుట్టూ శత్రు సమూహమే ఉన్న నేపథ్యంలో రక్షణపై ఇజ్రాయెల్ భారీగా ఖర్చు చేస్తుంది. 2022లో సైనిక అవసరాలకు ఏకంగా 2,340 కోట్ల డాలర్లు వెచ్చించింది.
► దేశ జనాభాపరంగా చూసుకుంటే ఇజ్రాయెల్ తలసరి సైనిక వ్యయం ఏకంగా 2,535 డాలర్లు. ఖతర్ తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది!
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment