టెల్ అవీవ్: రఫాపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన మారణహోమం.. అమాయక పాలస్తీనియన్లు చనిపోవడం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తప్పు చేశామని పార్లమెంటులో ప్రకటన చేశారు.
‘‘సాధారణ పౌరులకు ఎలాంటి హాని చేయకూడదని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ ఈ విషాదకర ఘటన జరిగింది. దీనిపై దర్యాప్తు చేస్తాం’’ అని పేర్కొన్నారు. అలాగని అంతర్జాతీయ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతిమ విజయం సాధించేవరకు యుద్ధం ఆపబోమని తెలిపారు.
మరోవైపు హమాస్ కమాండర్లు ఉన్నారన్న సమాచారంతోనే దాడి చేశామని.. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
రఫాపై దాడిని తక్షణం నిలిపివేయాలని ఒకవైపు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాలిచ్చినా, మరోవైపు అమెరికా సహా ప్రపంచమంతా కోరుకుంటున్నా ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో.. సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెలే ప్రకటించిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతంలో దాడులు జరిపింది. అప్పటికే అక్కడ గుడారాలు వేసుకుని ఉన్న పాలస్తీనా ప్రజలు మృతి చెందారు.
ఆదివారం రాత్రి రఫాపై జరిగిన ఈ భీకర వైమానిక దాడిలో 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి గాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది మహిళలు, చిన్నారులే. ఇప్పటివరకు గాజా పోరులో అత్యంత పాశవికమైన దాడుల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు. ఈ దాడికి సంబంధించి హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.
మిత్రదేశాల ఖండన
ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత దేశాలైన అమెరికా, ఫ్రాన్స్ సహా స్పెయిన్, ఇటలీ, ఐర్లాండ్, నార్వే, ఈజిప్టు, ఖతార్, తుర్కీయేలు తీవ్ర స్వరంతో ఖండించాయి. ‘‘ఈ ఆపరేషన్లను ఆపాలి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి. తక్షణం కాల్పుల విరమణ పాటించాలి’’ అని ‘ఎక్స్’ వేదికగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ పేర్కొన్నారు.
Outraged by the Israeli strikes that have killed many displaced persons in Rafah.
These operations must stop. There are no safe areas in Rafah for Palestinian civilians.
I call for full respect for international law and an immediate ceasefire.— Emmanuel Macron (@EmmanuelMacron) May 27, 2024
మరోవైపు.. ‘‘భూమి మీద ఉన్న నరకం గాజా, గత రాత్రి జరిగిన దాడి ఇందుకు మరో సాక్ష్యం’’ అని పాలస్తీనా శరణార్థులకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి సంస్థ యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment