టెల్ అవీవ్: మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు, అనుమతి లేని వస్తువులను వాసన ద్వారా క్షణాల్లో గుర్తించే శక్తిమంతమైన రోబోను ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రపంచంలో ఇలాంటి రోబో ఇదే మొదటిదట. సమీప భవిష్యత్తులో ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో ఇవి సేవలందిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాసనను పసిగట్టే ఎలక్ట్రానిక్ పరికరాల కంటే ఈ రోబో 10,000 రెట్లు ఎక్కువ కచ్చితత్వంతో పనిచేస్తుంది. సున్నితమైన వాసనలను సులువుగా గుర్తించేలా ఇందులో బయో సెన్సార్ అమర్చారు. మెషిన్ లెర్నింగ్ అల్గరిథంతో ఈ సెన్సార్‌ను ఎలక్ట్రానిక్ వ్యవస్థగా మార్చారు.
ప్రతి వాసనలోని ఎలక్ట్రిక్ చర్యను బట్టి అది ఏ రకం వాసనో చెప్పేస్తుంది. మనిషి ఎన్ని రకాల ఆధునిక టెక్నాలజీలను అభివృద్ధి చేసినా అవి ప్రకృతిలోని జీవులతో పోటీ పడలేవని వర్సిటీ ప్రతినిధులు డాక్టర్ బెన్ మావోజ్, ప్రొఫెసర్ అమీర్ అయాలీ చెప్పారు. ‘‘కొన్ని రకాల కీటకాలు వాసనలను సరిగ్గా గుర్తిస్తాయి. గాలిలోని కార్బన్ డయాక్సైడ్ స్థాయిని దోమలు కేవలం 0.01 శాతం వ్యత్యాసంతో సరిగ్గా గుర్తిస్తాయి. కీటకాల తరహాలో వాసనలను పసిగట్టే సెన్సార్ల అభివృద్ధిలో మనమింకా వెనకబడే ఉన్నాం’’ అని వివరించారు. పరిశోధన వివరాలు బయో సెన్సార్ అండ్ బయో ఎలక్ట్రానిక్స్ పత్రికలో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment