అంతా ఒక్కటే.. నో ఆడ, నో మగ, నో ట్రాన్స్‌జెండర్ | Joe Bidens Gender Discrimination Order Offers | Sakshi
Sakshi News home page

మనషులంతా ఒక్కటే.. నో ఆడ, నో మగ, నో ట్రాన్స్‌జెండర్

Published Mon, Jan 25 2021 12:12 AM | Last Updated on Mon, Jan 25 2021 1:45 PM

Joe Bidens Gender Discrimination Order Offers - Sakshi

అమెరికన్‌ ట్రాన్స్‌జెండర్‌లు

జో బైడెన్‌ బుధవారం ప్రెసిడెంట్‌ సీట్లో కూర్చోవడంతోనే పదిహేడు సంతకాలు పెట్టారు. వాటిల్లో ఒక సంతకం ట్రాన్స్‌జెండర్‌లది. ‘మనషులంతా ఒక్కటే. నో ఆడ, నో మగ, నో ట్రాన్స్‌జెండర్‌. వివక్ష పాటించరాదు’ .. అని సైన్‌ చేసేశారు. అయితే ఇందుకు అందరూ ఓకే. ఒక్క అథ్లెట్లే.. నాట్‌ ఓకే. ‘‘ట్రాన్స్‌ ఉమన్‌ రన్నర్‌ని మామూలు ఉమన్‌ రన్నర్‌తో పోటీకి దింపితే గెలిచేది ట్రాన్స్‌ ఉమనే. వాళ్లు బలంగా ఉంటారు. అప్పుడది అథ్లెట్స్‌ మధ్య పోటీ అవదు. శారీరకంగా బలమైనవాళ్లకు, వారికన్నా బలహీనమైన వాళ్లకు మధ్య పోటీ అవుతుంది’ అని వారి వాదన. బైడన్‌ ఏమంటారు! తన ఆర్డర్‌ను వెనక్కు తెప్పించి, ‘అథ్లెట్స్‌ తక్క’ అని రీ ఆర్డర్‌ పాస్‌ చేస్తారా? 

బైడెన్‌ దగ్గరకు వాషింగ్టన్‌ వెళ్లేముందొకసారి ఇండియాలోని గోపాల్‌పూర్‌కి వెళదాం. ఆరేళ్లు వెనక్కి. 2014 లోకి. ఏ గోపాల్‌పూర్‌ అంటే ఒడిశా జైపూర్‌ జిల్లాలో ఉన్న గోపాల్‌పూర్‌. స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌ ఊరు. ఊహు. తనక్కడ లేదు! పంజాబ్‌లో ఉందట.. ట్రైనింగ్‌ సెంటర్‌లో. గ్లాస్గోవ్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌కి ప్రాక్టీస్‌ చేస్తోంది. అప్పటికి ఆమె వయసు 18. పెద్దయ్యాక ఆడబోతున్న తొలి పెద్ద గేమ్‌! ఆ ముందు నెలలోనే తైవాన్‌ వెళ్లి ఏషియన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ ఆడొచ్చింది. 200 మీటర్ల పరుగు పందెంలో, 400 మీటర్ల రిలేలో గోల్డ్‌ మెడల్స్‌ కొట్టుకొచ్చింది. ‘‘వారెవ్వా అమ్మాయీ..’’ అంది ఇండియా.

ఇంకా అంటూనే ఉంది, అంతలోనే ద్యుతీకి ఢిల్లీ నుంచి పిలుపు.. అర్జెంటుగా ఢిల్లీ వచ్చెయ్యమని! పిలిచింది అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌. ద్యుతీ కాలు నిలవలేదు. ట్రైనింగ్‌కి బెంగళూరు పంపడానికి ఢిల్లీ రమ్మన్నారనుకుంది. పంజాబ్‌లో బస్సెక్కి, ఐదు గంటలు ప్రయాణించి ఢిల్లీ చేరుకుంది. ‘‘డాక్టర్‌ని కలువమ్మా.. ’’ అని ఫెడరేషన్‌ డాక్టర్‌ దగ్గరకు పంపించారు డైరెక్టర్‌. ద్యుతీ డౌట్‌ పడలేదు. ఫిట్‌నెస్‌ పరీక్షలు అనుకుంది. బ్లడ్‌ టెస్ట్, యూరిన్‌ టెస్ట్‌ చేసి, మూడో రోజు బెంగళూరు పంపించారు. అయితే ప్రాక్టీస్‌ కోసం కాదు. మరికొన్ని పరీక్షల కోసం. 

ద్యుతీకి క్రోమోజోమ్‌ ఎనాలిసిస్‌ టెస్ట్‌ చేశారు. ఎం.ఆర్‌.ఐ. తీశారు. గైనకాలజికల్‌ ఎగ్జామ్స్‌ చేశారు. తర్వాత హార్మోన్‌ పరీక్షలు! ద్యుతీ క్లిటారిస్‌ను కదలించి చూశారు. ఆ ప్రకంపనల్ని నోట్‌ చేశారు. వెజీనా గోడల్ని పరీక్షించి చూశారు. ప్యూబిక్‌ హెయిర్‌ సాంద్రత గుణాన్ని పట్టి పట్టి చూశారు. బ్రెస్ట్‌ దగ్గరికి వచ్చారు. నొక్కి చూశారు. సైజ్‌ చుట్టుకొలత తీసుకున్నారు! అవన్నీ కామన్‌ పరీక్షలేనేమో అనుకుంది ద్యుతీ. రిపోర్ట్స్‌లో ‘అన్‌ కామన్‌’ అని వచ్చింది! ద్యుతీలో స్త్రీ పాళ్లు తక్కువగా పురుషపాళ్లు ఎక్కువగా ఉన్నాయని వచ్చింది. మగాళ్లలో ఉండే టెస్టోస్టెరోన్‌ హార్మోన్‌ ఆడవాళ్లలో లీటరు రక్తానికి 1.0–3.3 నానోమోల్స్‌ మధ్య మాత్రమే ఉండాలి. ద్యుతీలో 10 నానోమోల్స్‌కి మించి ఉన్నాయి.

దానర్థం ఆమె మహిళ కాదు!! మహిళలతో పోటీ పడటానికి లేదు. పైకి మహిళే కనుక మగాళ్లతోనూ ఆమెను పోటీ పడనివ్వడానికి లేదు. అయ్యో.. ద్యుతీ కెరీర్‌ అంతమైపోయినట్లేనా? ఆమె కెరీర్‌ సంగతి తర్వాత, ఆమెతో పోటీ పడితే అమ్మాయిల కెరీర్‌ అంతమైపోయినట్లేనని అథ్లెట్స్‌ ఫెడరేష¯Œ  ఆలోచనలో పడిపోయింది. 150 సెంటీ మీటర్ల ఎత్తు మాత్రమే.. అంటే 4 అడుగుల 9 అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న ద్యుతీ రన్నింగ్‌లో అంత శక్తిమంతమైన అడుగు ఎలా వేయగలుగుతోంది అనే సందేహం తీర్చుకునేందుకే ఫెడరేషన్‌ ఆమెకు టెస్టోస్టెరోన్‌ టెస్ట్‌లు చేయించింది. చేయించాక, ఆడవాళ్లతో ద్యుతీ పోటీ పడడం సబబేనా అనే తర్కంలో పడిపోయింది. తర్వాతేమైంది! 

భారీ అడుగు : భారతీయ స్ప్రింటర్, 100 మీటర్ల పరుగు ఈవెంట్‌లో ప్రస్తుతం మన నేషనల్‌ చాంపియన్‌ ద్యుతీ చంద్‌

ద్యుతీ చంద్‌కి ఇప్పుడు 24 ఏళ్లు. ఏషియన్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండు బంగారు పతకాలు సాధించాక గ్లాస్గోవ్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఆడలేకపోయినా ఆమె 2016లో, 2017లో, 2018లో ఆడింది. పతకాలు సంపాదించింది. 2019లో ఇటలీ వెళ్లి సమ్మర్‌ యూనివర్సియాyŠ  100 మీటర్ల పరుగులో గోల్డ్‌ మెడల్‌ గెలుచుకొచ్చింది. ఇవన్నీ కూడా ‘సోర్ప్‌›్ట కోర్టు’లో కేస్‌ వేసి, టెస్టోస్టెరాన్‌ రూల్స్‌ అన్యాయం అని వాదించి, కేసు నెగ్గి, ఆడి, సాధించింది. ఆ తర్వాత 2019 లో తొలిసారి తను ఎల్‌జీబీటీ (ట్రాన్స్‌జెండర్‌) సభ్యురాలినని బాహాటంగా ప్రకటించుకుంది. ఈ ఏడాది జరిగే ఒలింపిక్స్‌కి కూడా వెళుతోంది. అక్కడా ఆడవాళ్లతోనే తను ఆడుతుంది. అయితే ఇది అన్యాయం అనే వాళ్లు అంటూనే ఉన్నారు.

ద్యుతీ తనను ట్రాన్స్‌ ఉమెన్‌ గా ప్రకటించుకున్నాక కూడా మహిళల కేటగిరీలో ఆమెకు చోటు ఇవ్వడం ఏమిటని వారి వాదన. ఈ వాదనకు బలం ఉన్నా, వాదనగా నిలబడే బలం మాత్రం లేదు. ఐ.ఎ.ఎ.ఎఫ్‌. (ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ కౌన్సిల్‌) 2019 అక్టోబర్‌ నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త ట్రాన్స్‌జెండర్‌ నిబంధనల ప్రకారం ట్రాన్స్‌ ఉమన్‌ మహిళలు తమ రక్తంలో లీటరుకు 5 నానోమోల్స్‌కు మించి టెస్టోస్టెరోన్‌ లేదని (ఈవెంట్‌లో పాల్గొనడానికి ముందు పన్నెండు నెలల నుంచి) రుజువు చేసి సంతకం పెట్టి ఇస్తే చాలు. ఆటకు అర్హులే. మరి ఒలింపిక్స్‌ నాటికి ద్యుతీ చంద్‌ టెస్టోస్టెరోన్‌ 5 నానోమోల్స్‌కి మించి ఉంటే? ఆమె ఆడలేకపోవచ్చు. 

ఇప్పుడు బైడన్‌ దగ్గరికి వద్దాం. ‘మనుషులంతా ఒక్కటే. ఎవరినీ లైంగిక వివక్షతో చూడకూడదు’ అని బుధవారం ఆయన ఆర్డర్‌ పాస్‌ చేసినప్పటి నుంచి అగ్రరాజ్యంలో ట్రాన్స్‌జెండర్‌ ల విజయోత్సవాలు జరుగుతున్నాయి. ‘మా మంచి ప్రెసిడెంట్‌’ అని బైడెన్‌కు ట్రాన్స్‌జెండర్‌ లు పూల గుచ్ఛాలు పంపుతున్నారు. వాళ్ల సంతోషానికి, బైడెన్‌ సమభావనకు ఎవరూ అడ్డు పడటం లేదు కానీ, ‘‘మహిళల స్పోర్ట్‌ ఈవెంట్‌కి ట్రాన్స్‌ మహిళల్ని అనుమతించకండి. వాళ్లు బలంగా ఉంటారు. వాళ్లతో పోటీ పడితే మేము ఓడిపోతాం’’ అని క్రీడారంగంలోని అమెరికన్‌ మహిళలు బైడెన్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ‘కరెక్టే’ అని రిపబ్లికన్‌లు మద్దతు ఇస్తున్నారు. 

ఏ రంగంలోనైనా తొలి ట్రాన్స్‌ అవడం నిజంగా గొప్ప సంగతే. ఇండియానే తీసుకుందాం. తొలి ట్రాన్స్‌జెండర్‌ న్యాయవాది సత్యశ్రీ షర్మిల. తొలి ట్రాన్స్‌జెండర్‌ జడ్జి జోయితా మండల్‌. తొలి ట్రాన్స్‌జెండర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ ప్రీతికాయషిని. తొలి ట్రాన్స్‌జెండర్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ మానవీ బందోపాధ్యాయ్‌. ఎన్నికల్లో నిలబడిన తొలి ట్రాన్స్‌జెండర్‌ ముంతాజ్‌. ఎమ్మెల్యేగా గెలిచిన తొలి ట్రాన్స్‌జెండర్‌ షబ్మమ్‌ మౌసీ. తొలి ట్రాన్స్‌జెండర్‌ సిపాయి షబీ. తొలి ట్రాన్స్‌జెండర్‌ మెడికల్‌ అసిస్టెంట్‌ జియా దాస్‌. వీళ్లందరివీ గొప్ప అచీవ్‌మెంట్స్‌. కానీ భౌతిక శక్తి అవసరమైన క్రీడా పోటీలలో మహిళల కేటగిరీలోకి ట్రాన్స్‌ ఉమన్‌ని అనుమతించి, వారు గెలిచినప్పుడు ‘తొలి ట్రాన్స్‌ ఉమన్‌ రన్నర్‌’ అని అనడం వారి విజయానికి సంపూర్ణతను ఇచ్చినట్లవుతుందా? బహుశా బైడెన్‌ ఆర్డర్‌ నుంచి ట్రాన్స్‌జెండర్‌ లు తమకు తాముగానే క్రీడారంగాన్ని మినహాయించుకోడానికి త్వరలోనే ముందుకు రావచ్చు. వారి గౌరవం కోసం వాళ్లు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement