కిమ్‌కు ఉన్న పిచ్చి ఏంటంటే.?.. నటిని కిడ్నాప్‌ చేసి.. | Kim Jong Il Lidnapped Actress to Make Modern Films | Sakshi
Sakshi News home page

Kim Jong il: కిమ్‌కు ఉన్న పిచ్చి ఏంటంటే.?.. నటిని కిడ్నాప్‌ చేసి..

Published Sat, Jan 13 2024 7:50 AM | Last Updated on Sat, Jan 13 2024 8:52 AM

Kim Jong Il Lidnapped Actress to Make Modern Films - Sakshi

ప్రస్తుత ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ 1994 జూలై నుంచి 2011 డిసెంబర్‌లో తానుమరణించే వరకు ఉత్తర కొరియా నియంతగా కొనసాగారు. కొరియన్ యువతపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం చూపే ప్రతీ అంశాన్ని కిమ్ జోంగ్ ఇల్ నిషేధించారు. విదేశీ సినిమాలు చూడటం మొదలుకొని బ్లూ జీన్స్ ధరించడం వరకు అన్నింటినీ నిషేధించారు. జోంగ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్‌కు సినిమాలంటే విపరీతమైన పిచ్చి. తన దేశంలో సినిమాలు తీయడానికి ఒక ప్రముఖ దక్షిణ కొరియా నటిని, ఆమె భర్తను కిడ్నాప్ చేశాడు.

కిమ్ జోంగ్ ఇల్ నాటి ప్రముఖ దక్షిణ కొరియా నటి చోయ్ యున్ హీని కిడ్నాప్ చేసి, రెండున్నరేళ్లు నిర్బంధించి, ఆమె చేత 17 సినిమాలు చేయించాడు. ఈ సంఘటన 1978 నాటిది. ఆ కాలాన్ని దక్షిణ కొరియా చిత్రాలకు గోల్డెన్ పీరియడ్ అని అంటారు. అప్పట్లో చాలా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటిగా విడుదలయ్యేవి. చోయ్ యున్ హీ 60వ దశాబ్ధం నుండి 70ల తొలినాళ్ల వరకు గొప్ప నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె భర్త షిన్ జియోంగ్ గ్యున్ సినిమా దర్శకుడు. వీరు సెలబ్రిటీ జంటగా పేరుగాంచారు.

ఓ జూనియర్ నటితో ఆమె భర్తకు అక్రమ సంబంధం ఏర్పడిన కారణంగా వారి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ సమయంలో నటి చోయ్ యున్ హీ ఒక వ్యాపార ఒప్పందం కోసం హాంకాంగ్‌ వెళ్లారు. ఇంతలో ఉత్తర కొరియా ఏజెంట్ ఆమెను కిడ్నాప్ చేశాడు. అతను ఆమెను స్పీడ్‌బోట్‌లోకి ఎక్కించి, తమ నియంత కిమ్ జోంగ్ ఇల్ వద్దకు తీసుకెళ్లాడు. హాంకాంగ్‌లో జరిగిన వ్యాపార ఒప్పందం  అనేది తనను కిడ్నాప్ చేయడానికి జరిగిన కుట్ర అని ఆ నటికి అప్పుడు అర్థమైంది. అయితే  తాము ఆమెను కిడ్నాప్ చేయలేదని, ఆమె ఇష్టానుసారమే  ఇక్కడికి వచ్చినట్లు కిమ్ జోంగ్ ఇల్ ప్రచారం చేయించాడు.

ఉత్తర కొరియాలో రూపొందే సినిమాలు అంతర్జాతీయ ప్రశంసలు పొందాలని కిమ్ జోంగ్ ఇల్ తపించిపోయాడు. చోయ్ యున్ హీ భర్తను కూడా తమ ప్రాంతానికి బలవంతంగా తీసుకువచ్చాడు. అయితే  ఆ దర్శకుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో అతనిని జైలుకు తరలించారు. ఐదేళ్లపాటు జైలులో ఉంచి వివిధ శిక్షలు విధించారు. నార్త్ కొరియా కోసం సినిమాలు తయాలని ఆదేశించారు. 

షిన్ జియోంగ్ గ్యున్ ఒక డాక్యుమెంటరీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను, తన భార్య చోయ్ యున్ హీ కలసి రెండేళ్లలో మొత్తం 17 సినిమాలు చేశామని చెప్పారు. రాత్రిపూట మూడు గంటలకు మించి నిద్రపోకూడదని, నిరంతరం పని చేయాలని, అప్పుడే మా ప్రాణాలు నిలబడతాయని కిమ్ జోంగ్ ఇల్ ఆదేశించారని షిన్ జియోంగ్ గ్యున్ తెలిపారు. అయితే 1986లో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా కిమ్ నటి చోయ్ యున్ హీ, దర్శకుడు షిన్ జియోంగ్ గ్యున్‌లను ఉత్తర కొరియా ప్రతినిధులుగా పంపారు. వారికి కిమ్‌ గట్టి కాపలా ఏర్పాటు చేశాడు. గదుల్లో కూడా గార్డులను మోహరించాడు. అయితే  ఆ దంపతులు ఎలాగోలా తప్పించుకుని, అమెరికా చేరుకుని అక్కడ ఆశ్రయం పొందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement