Brazil Presidential Elections: Lula Da Silva Elected As President, Defeats Bolsonaro - Sakshi
Sakshi News home page

బ్రెజిల్‌ కొత్త అధ్యక్షుడిగా లులా డ సిల్వా.. మోదీ శుభాకాంక్షలు

Oct 31 2022 3:09 PM | Updated on Oct 31 2022 4:02 PM

Lula Da Silva Wins Brazil Presidential Election Defeats Bolsonaro - Sakshi

కొత్త అధ్యక్షుడిగా వర్కర్స్‌ పార్టీ నేత లూయిజ్‌ ఇనాసియో లులా డ సిల్వా అలియాస్‌ లులా(77) ఎన్నికయ్యారు.

బ్రెసిలియా: బ్రెజిల్‌ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్‌ జైర్‌ బోల్సోనారో ఓటమిపాలయ్యారు. కొత్త అధ్యక్షుడిగా వర్కర్స్‌ పార్టీ నేత లూయిజ్‌ ఇనాసియో లులా డ సిల్వా అలియాస్‌ లులా(77) ఎన్నికయ్యారు. ఆదివారం(అక్టోబర్‌ 30) జరిగిన ఎన్నికల్లో జైర్‌ బోల్సోనారోను ఓడించి బ్రెజిల్‌ 39వ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఇరువురి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. స్వల్ప తేడాతో బోల్సోనారోపై లులా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో లులాకు 50.9శాతం ఓట్లు రాగా.. ప్రస్తుత అధ్యక్షుడు బోల్సోనారోకు 49.1 శాతం ఓట్లు వచ్చినట్లు ఆ దేశ అత్యున్నత ఎన్నికల విభాగం తెలిపింది.

తాజా ఎన్నికతో లులా డ సిల్వా బ్రెజిల్‌ అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో 2003 నుంచి 2010 వరకు ప్రెసిడెంట్‌గా చేశారు. సరిగ్గా 20 ఏళ్ల కిందట తొలిసారి బ్రెజిల్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన లులా డ సిల్వా.. అధికారం కోల్పోయి తర్వాత అవినీతి ముద్రతో జైలుకు వెళ్లారు. బయటకు వచ్చి రాజకీయ పోరాటంలో మళ్లీ అధ్యక్షుడిగా గెలిచి చరిత్ర సృష్టించారు. 

ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడారు లులా డ సిల్వా. ‘దేశం మొత్తాన్ని ఏకం చేసేందుకు కృషి చేస్తాను. ఆయుధాల వినియోగాన్ని తగ్గించేందుకు పాటుపడతాం. అలాగే అమెజాన్‌ అడవులను రక్షించేందుకు అంతర్జాతీయ సహకారం కావాలి. ప్రపంచ దేశాలు అందుకు సహకరించాలి. ప్రపంచ వ్యాణిజ్యం మరింత పారదర్శకంగా చేస్తాం.’ అని పేర్కొన్నారు లులా. అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లిన క్రమంలో 2018లో పోటీ చేసేందుకు అనర్హులుగా మారారు లులా. 2021లో ఆయనపై ఉన్న కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం లభించింది. 

ప్రధాని మోదీ శుభాకాంక్షలు..
బ్రెజిల్‌ 39వ అధ్యక్షుడిగా ఎన్నికైన లులా డ సిల్వాకు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే.. అంతర్జాతీయ అంశాలపై సహకారం అందిస్తామన్నారు.

ఇదీ చదవండి:  Morbi Tragedy: కేబుల్‌ బ్రిడ్జి దుర్ఘటనపై పుతిన్‌ సంతాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement