
న్యూయార్క్ : సంపన్న దేశాలు కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా త్వరలో రానున్న కరోనా వైరస్ 100 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోస్‌లను తమ దేశాల కోసం బుక్ చేసుకున్నారు. దీంతో మిగిలిన ప్రపంచ దేశాలు ఈ మహమ్మారిని తరిమికొట్టడంలో వెనుకబడిపోవాల్సి వస్తోంది. ఇప్పటికే ఈ దిశగా అమెరికా, బ్రిటన్, సనోఫి, గ్లాక్సో స్మిత్‌క్లైన్‌ల నుంచి ఈ డోస్‌లను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. అలాగే జపాన్, ఫైజర్‌లతో కూడా ఈ దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. వ్యాక్సిన్‌ని సరసమైన ధరల్లో అందరికీ అందుబాటులో ఉంచుతామని అంతర్జాతీయ సంస్థలు, దేశాలు హామీ యిస్తున్నాయి.
అయితే 780 కోట్ల ప్రపంచ జనాభా అంతటికీ ఈ డోస్‌లన్నీ సరఫరా చేయగలుగుతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2009లో స్వైన్ ఫ్లూ ప్రబలినప్పుడు కూడా సంపన్న దేశాలు భారీ స్థాయిలో టీకా సరఫరాను తమ అధీనంలో ఉంచుకోవడం పేదదేశాలను ఆందోళనలోకి నెట్టింది. లండన్‌కి చెందిన ఎయిర్‌ఫీనిటీ సంస్థ అంచనా ప్రకారం 130 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, జపాన్‌లు ఇప్పటికే కొనుగోలు చేశాయి. ప్రపంచం మొత్తానికి సరిపడిన వ్యాక్సిన్‌లను తక్షణం సరఫరా చేయడం కష్టంతో కూడుకున్నపనేనని ఆ సంస్థ తెలిపింది.(కోవిడ్‌కు చికిత్స లేకపోవచ్చు: డబ్ల్యూహెచ్‌వో)