వాషింగ్టన్: క్రిస్టమస్ పర్వదినం నాడు అమెరికా టెన్నెసీ రాష్ట్రం నాష్‌విల్లే నగరంలో ఓ వాహనంలో అమర్చిన బాంబు పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాడికి పాల్పడిన వ్యక్తి మరణించగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇక దాడికి పాల్పడిన వ్యక్తిని ఆంథోనీ క్విన్ వార్నర్‌గా గుర్తించారు. అయితే ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతోనే క్విన్ వార్నర్ ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. బాంబ్ బ్లాస్ట్ జరగడానికి వారం ముందు క్విన్ వార్నర్ ‘ప్రపంచం తనను ఎన్నటికి మర్చిపోదని’ ఇరుగుపొరుగు వారితో అన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా క్విన్ వార్నర్ ఇంటి పక్క నివసించే రిక్ లాడ్ అనే వ్యక్తి బాంబ్ బ్లాస్ట్‌కు వారం ముందు నిందితుడికి, తనకు మధ్య జరిగిన సంభాషణను వెల్లడించాడు.
‘క్రిస్టమస్‌కు వారం రోజుల ముందు నేను, క్విన్ వార్నర్ కాసేపు పండగ గురించి ముచ్చటించుకున్నాం. మాటలో మధ్యలో క్విన్ వార్నర్ క్రిస్టమస్ సందర్భంగా శాంటా తన కోసం ఏదైనా మంచిది తీసుకురాబోతన్నాడు అని అన్నాడు. అంతేకాక ప్రపంచం తనను ఎన్నటికి మర్చిపోదని వ్యాఖ్యానించాడు. అయితే అతడి మాటల వెనక ఇంత దారుణమైన ఆలోచన దాగుందని నాకు ఆనాడు తెలియలేదు. అసలు అతడి మీద ఎలాంటి అనుమానం కలగలేదు’ అన్నాడు లాడ్. ప్రస్తుతం అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాంబ్ బ్లాస్ట్ వెనక గల ప్రధాన ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇప్పటికే క్విన్ వార్నర్ కంప్యూటర్, హార్డ్‌డ్రైవ్‌ని స్వాధీనం చేసుకున్నారు. (15 మంది చిన్నారులను బలిగొన్న రిక్షా బాంబు)
గత శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో టెన్నెసీ రాష్ట్రం నాష్‌విల్లే నగరంలోని ఓ ప్రాంతంలో నిలిపి ఉంచిన వాహనంలో దుండగులు అమర్చిన బాంబు పేలింది. అయితే పేలుడు జరగడానికి ముందు ఆ ప్రాంతంలో కాల్పులు జరుగుతున్నట్లు గుర్తు తెలియని దుండగుల నుంచి సమాచారం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అప్రమత్తమవుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతుండగా.. అక్కడే నిలిపి ఉంచిన ఓ రిక్రియేషనల్ వ్యాన్ నుంచి బాంబు పేలుడుకు సంబంధించిన ప్రకటన తమకు వచ్చినట్లు తెలిపారు. మరో 15 నిమిషాల్లో ఈ ప్రాంతంలో బాంబు పేలే ప్రమాదం ఉంది అంటూ రికార్డు చేసి ఉంచిన సందేశం తమకు వినపడిందని తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దగ్గర్లోని భవనాలు, ఇళ్ల నుంచి అందరినీ ఖాళీ చేయించామని, దీంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment