నాష్‌విల్లే స్కూల్‌లో దురాగతం..మాజీ విద్యార్థి పనే | Transgender Woman gun fire at USA Nashville Christian Elementary School | Sakshi
Sakshi News home page

నాష్‌విల్లే స్కూల్‌లో దురాగతం..మాజీ విద్యార్థి పనే

Published Wed, Mar 29 2023 5:30 AM | Last Updated on Wed, Mar 29 2023 5:30 AM

Transgender Woman gun fire at USA Nashville Christian Elementary School - Sakshi

నాష్‌విల్లే: అమెరికాలోని నాష్‌విల్లే క్రిస్టి యన్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో జరిగిన కాల్పుల్లో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మృతుల్లో తొమ్మిదేళ్ల ముగ్గురు చిన్నారులతోపాటు స్కూల్‌ హెడ్‌ కేథరిన్, ఒక సబ్‌స్టిట్యూట్‌ టీచర్, కస్టోడియన్‌ ఒకరు ఉన్నారు. అనంతరం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోయిన వ్యక్తిని 28 ఏళ్ల ఆడ్రే ఎలిజబెత్‌ హేల్‌ అనే ట్రాన్స్‌జెండర్‌ మహిళగా గుర్తించారు. కాల్పుల గురించి పోలీసులకు 10.13 గంటల సమయంలో సమాచారం అందింది.

వెంటనే స్కూల్‌ వద్దకు చేరుకుని మొదటి అంతస్తులో ఉన్న విద్యార్థులు, సిబ్బందిని ఖాళీ చేయించారు. రెండో అంతస్తులో కాల్పుల శబ్దం వినిపించడంతో అక్కడికి వెళ్లిన పోలీసులపై హేల్‌ కాల్పులకు తెగించింది. వెంటనే జరిపిన ఎదురుకాల్పుల్లో హేల్‌ అక్కడికక్కడే హతమైంది. ఆమె వద్ద ఉన్న రెండు అసాల్ట్‌ రైఫిళ్లు, ఒక హ్యాండ్‌ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 నిమిషాల్లో ఇదంతా జరిగిపోయింది. ఆమె స్కూల్‌లోకి కారులో వచ్చినట్లుగా సీసీ ఫుటేజీలో రికార్డయి ఉంది.

షూటర్‌ హేల్‌ మాజీ విద్యార్థి అని అంటున్న పోలీసులు ప్రస్తుతం ఆమెకు స్కూల్‌తో గానీ స్కూల్‌ స్టాఫ్‌తో గానీ ఎటువంటి సంబంధాలున్నాయి? ఎవరిపై అయినా విరోధంతో ఈ ఘోరానికి పాల్పడిందా? అనే విషయాలను పోలీసులు వెల్లడించలేదు. అయితే, కోవెనంట్‌ స్కూల్‌పై ద్వేష భావం ఉన్నట్లు కనిపిస్తోందని పోలీస్‌ చీఫ్‌ జాన్‌ డ్రేక్‌ అన్నారు. మరోచోట కూడా కాల్పులు జరిపేందుకు హేల్‌ పథకం వేసినట్లు భావిస్తున్నామన్నారు. ఎన్‌కౌంటర్‌ ముగిసిన వెంటనే హేల్‌ ఇంట్లో జరిపిన సోదాల్లో పోలీసులకు రెండు షాట్‌గన్‌లు దొరికాయి.

ఇంకా స్కూల్‌కు సంబంధించిన మ్యాప్, ఇతర ప్రదేశాల మ్యాప్‌లు, కాల్పులకు ముందు రెక్కీ చేపట్టినట్లు ఆధారాలు దొరికాయి. ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు, అనూహ్య ఘటన జరగబోతోందంటూ కొద్ది నిమిషాలకు ముందే హేల్‌ తమకు మెసేజీలు పంపినట్లు  స్నేహితులు చెబుతున్నారు. దారుణానికి వేదికైన కోవెనంట్‌ ప్రెస్బిటేరియన్‌ చర్చి స్కూల్‌ 2001లో ప్రారంభమైంది. ఇక్కడ ప్రి స్కూల్‌ నుంచి ఆరో గ్రేడ్‌ వరకు 200 మంది వరకు చిన్నారులు చదువుకుంటుండగా, 50 మంది సిబ్బంది ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement