ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా ఏటా దాలుస్తున్న గర్భాల్లో దాదాపు సగం వరకు అంటే..12.1 కోట్ల గర్భాలు అవాంఛితాలేనని ఐక్యరాజ్యసమితికి చెందిన పాపులేషన్ ఫండ్ తెలిపింది. తీవ్రమైన ఈ సమస్యను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని పేర్కొంది. ఈ మేరకు బుధవారం వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్–2022 విడుదల చేసింది. అవాంఛిత గర్భం దాల్చిన వారిలో 60% వరకు అబార్షన్ చేయించుకుంటున్నారని తెలిపింది.
ఇందులో సుమారు 45% సురక్షితం కాని అబార్షన్లు కాగా, అబార్షన్ల సమయంలో 5%–13% వరకు మరణాలు కూడా సంభవిస్తున్నాయని పేర్కొంది. ‘1990–2019 మధ్య 15–49 ఏళ్ల గ్రూపులో ప్రతి వెయ్యి మంది మహిళల్లో అవాంఛిత గర్భాలు 79 నుంచి 64కు తగ్గటం కొంత ఊరట కలిగించే విషయం. అయితే, గత 30 ఏళ్లలో అవాంఛిత గర్భం దాల్చిన మహిళల సంఖ్య 13% మేర పెరిగింది. జనాభా పెరుగుదలే ఇందుకు కారణం’ అని నివేదిక పేర్కొంది.
‘ప్రపంచవ్యాప్తంగా 25.7 కోట్ల మంది గర్భం వద్దనుకునే మహిళలు సురక్షితమైన, ఆధునిక గర్భ నిరోధక సాధనాలను వాడటం లేదు. మొత్తంగా 47 దేశాలకు చెందిన లైంగిక చర్యలో చురుకుగా పాల్గొనే మహిళల్లో 40% మంది ఎలాంటి గర్భనిరోధక పద్ధతులను పాటించడం లేదు’ అని తెలిపింది. ‘సంతాన సామర్థ్యం ఉన్న 64 దేశాల్లోని మహిళలపై చేపట్టిన సర్వేలో..23% మంది సెక్స్‌కు అభ్యంతరం చెప్పలేకపోతున్నారు. తమ ఆరోగ్యం గురించి 24% మంది, గర్భనిరోధకాల వాడకం విషయంలో 8% మంది సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. మొత్తమ్మీద 57% మంది మహిళలు మాత్రమే తమ లైంగిక, సంతాన సంబంధ విషయాల్లో నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు’ అని వెల్లడైనట్లు ఆ నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment