
ప్యాంగాంగ్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అంటే ప్రపంచ దేశాలే కాదు సొంత ప్రజలు కూడా భయపడుతారు. ఆయన నిర్ణయాలు అలా ఉంటాయి మరి. తాజాగా కిమ్ ప్రభుత్వం విధించిన కొత్త ఆంక్షలు ఉత్తరకొరియాలో కొంతమంది అమ్మాయిలు, మహిళలకు ఇబ్బందికరంగా మారాయి. కిమ్ కూతురు 'జు ఏ' పేరు దేశంలో మరెవరికీ ఉండొందట. అలాంటి పేరు ఎవరికి ఉన్నా.. వారు వెంటనే మార్చుకుని వేరే పేరు పెట్టుకోవాలట.
'జు ఏ' అనే పేరుతో ఉన్న మహిళతో పాటు, అదే పేరు పెట్టుకున్న 12 ఏళ్ల చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం నోటీసులు పంపింది. వెంటనే పేర్లు మార్చుకోవాలని సూచించింది. జనన ధ్రువీకరణ పత్రం కూడా మార్చుకోవాలని స్పష్టం చేసింది. దీంతో జు ఏ పేరు ఉన్న వారు మాకేంటీ బాధ.. అనుకుంటున్నారు. గత్యంతరం లేక పేరు మార్చుకుంటున్నారు.
కిమ్ కూతురు జు ఏ కొద్ది రోజులగా తండ్రితో పాటు ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దీంతో కిమ్ తర్వాత ఉత్తరకొరియాను పాలించబోయేది ఆమే అని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే ఉత్తరకొరియాలో ప్రజలు పేర్లు మార్చుకోవాలని అధినేతలు హుకుం జారీ చేయడం ఇది తొలిసారేం కాదు. కిమ్ II- సంగ్ పాలనలో కూడా ప్రజలు ఆయన పేరును పెట్టుకోకూడదనే రూల్ ఉండేది. కిమ్ జోంగ్ ఉన్ అధికారం చేపట్టాక కూడా తన పేరుతో పాటు, తన భార్య పేరు సోల్-జు పేరు ఎవరికీ ఉండొద్దని నిబంధన తీసుకొచ్చారు. అప్పటికే ఆ పేరు ఉన్నవారు మార్చుకోవాలని తేల్చిచెప్పారు.
చదవండి: బైడెన్ ఆర్థిక బృందంలో భారతీయుడు..