బుల్లి సౌర ఫలకం!
వెంట్రుక కన్నా 100 రెట్లు పలుచన
సెల్ ఫోన్‌ను ఇట్టే చార్జ్ చేసుకోవచ్చు
ఆక్స్‌ఫర్డ్ సైంటిస్టుల ఆవిష్కారం
ఒకవైపు ఇంధన అవసరాలు నానాటికీ ఊహాతీతంగా పెరిగిపోతున్నాయి. సంప్రదాయ ఇంధన వనరుల ఉత్పత్తి అంతులేని కాలుష్యానికి, గ్లోబల్ వారి్మంగ్ పెనుభూతానికి కారకంగా మారుతోంది. సౌర విద్యుత్ సమర్థ ప్రత్యామ్నాయంగా కని్పస్తున్నా దాని తయారీకి భారీ ఫలకాలు, విశాలమైన స్థలం వంటివెన్నో కావాలి. ఈ సమస్యలకు కూడా చెక్ పెడుతూ, సౌర విద్యుదుత్పత్తిని అత్యంత సులభతరం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఎక్కడికక్కడ సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలిగే అతి సూక్ష్మ సౌర ప్యానళ్లు త్వరలో రాబోతున్నాయి. వెంట్రుక మందంలో కేవలం వందో వంతు మాత్రమే ఉండే ఈ బుల్లి సౌర ప్యానళ్లను ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ సైంటిస్టులు తాజాగా అభివృద్ధి చేశారు. వీటిని ప్రయాణాల్లో వీపుకు తగిలించుకునే బ్యాక్‌ప్యాక్‌పై, సెల్ ఫోన్ వెనక, కార్ రూఫ్ మీద... ఇలా ఎక్కడైనా సులువుగా అమర్చుకోవచ్చు! అంతేకాదు, ప్రస్తుత సౌర ఫలకాల కంటే రెట్టింపు సౌర విద్యుదుత్పాక సామర్థ్యం ఈ బుల్లి ఫలకాల సొంతం!!
ఎలా పని చేస్తుంది?
ఈ బుల్లి ప్యానళ్లలో సోలార్ కోటింగ్‌ను పెరోవ్‌సై్కట్స్‌గా పిలిచే పదార్థంతో తయారు చేస్తారు. ప్రస్తుత సిలికాన్ ఆధారిత సౌర ప్యానళ్లతో పోలిస్తే ఇది సూర్యరశి్మని మరింత మెరుగ్గా ఒడిసిపడుతుంది. పైగా ప్రస్తుత ప్యానళ్లు అవి ఒడిసిపడుతున్న సూర్యరశి్మలో 22 శాతాన్ని మాత్రమే ఇంధనంగా మార్చగలుగుతున్నాయి. ఆక్స్‌ఫర్డ్ సైంటిస్టులు రూపొందించిన బుల్లి ప్యానళ్లు 27 శాతం సామర్థ్యంతో పని చేస్తాయి. దీన్ని మున్ముందు 45 శాతం దాకా పెంచుకోవచ్చని వాళ్లు బల్లగుద్ది చెబుతున్నారు. ‘‘తొలిసారి రూపొందించినప్పుడు వీటి కన్వర్షన్ సామర్థ్యం 6 శాతమే.
ఐదేళ్లలోనే దాన్ని 27 శాతానికి పెంచగలిగాం’’ అని వివరించారు. ‘‘ఎలా చూసుకున్నా సౌర విద్యుదుత్పత్తి రంగంలోనే ఇది అతి కీలకమైన ముందడుగు. ఎందుకంటే సిలికాన్ ఆధారిత ప్యానళ్లను బిగించేందుకు ప్రత్యేక సౌర క్షేత్రాలు తప్పనిసరి. అందుకు పంట పొలాలను వాడుతుండటం ప్రపంచవ్యాప్తంగా రైతుల ఆందోళనలు తదితరాలకు దారితీస్తోంది. కానీ పెరోవ్‌సై్కట్స్ ప్యానళ్లకు ఆ అవసరమే ఉండదు.
సిలికాన్ ప్యానళ్లతో పోలిస్తే వీటిని ఎక్కడంటే అక్కడ అతి సులువుగా బిగించుకోవచ్చు. కారుచౌకగా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎలాంటి ఉపరితలం మీదైనా ఇవి సులువుగా ఒదిగిపోతాయి. చివరికి ప్లాస్టిక్, కాగితంపై కూడా!’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న ఆక్స్‌ఫర్డ్ సైంటిస్టు జుంక్ వాంగ్ వివరించారు. ‘‘పెరోవ్‌సై్కట్స్ ప్యానళ్లలో కేవలం ఒక మైక్రాన్ మందం కోటింగ్ ఉంటుంది. ప్రస్తుత సౌర ప్యానళ్లలో వాడుతున్న సిలికాన్ కోటింగ్‌తో పోలిస్తే ఇది ఏకంగా 150 రెట్లు పలుచన’’ అని చెప్పారు.
ఆ సమస్యనూ అధిగమిస్తే...
సంప్రదాయ సిలికాన్ సౌర ప్యానళ్లతో పోలిస్తే బుల్లి ప్యానళ్లలో ఒక పెద్ద సమస్య లేకపోలేదు. అదే... స్థిరత్వం! పెరోవ్‌సై్కట్స్ ప్యానళ్లు ప్రయోగశాల పరిస్థితుల్లోనే కరిగిపోతున్నాయి. లేదా కొద్ది రోజుల్లోనే విరిగిపోతున్నాయి. అయితే ఇది సమస్యేమీ కాదని వాంగ్ అన్నారు. ‘‘వాటి జీవితకాలాన్ని పెంచేందుకు జరుగుతున్న పరిశోధనలు కొలిక్కి వస్తున్నాయి’ అని వివరించారు.
ఆకాశమే హద్దు...!
ప్రపంచవ్యాప్తంగా సౌర ప్యానళ్ల ఏర్పాటు ఒక్క గత ఏడాదిలోనే ఏకంగా 80 శాతం పెరిగినట్టు స్వచ్ఛ ఇంధన గణాంకాలు, విశ్లేషణలో పేరున్న వుడ్ మెకెంజీ సంస్థ వెల్లడించింది. వాటి ఏర్పాటుకు వెచి్చంచాల్సిన ఖర్చు భారీగా తగ్గుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఫలితంగా సౌర విద్యుత్ అతి చౌకైన ఇంధన వనరుగా మారిపోతోంది. అంతేగాక గత 19 ఏళ్లుగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విద్యుత్ వనరుగా నిలుస్తూ వస్తోంది. ‘‘ఈ పరిస్థితుల్లో మేం రూపొందించిన బుల్లి సౌర ప్యానళ్లు గనక ఒక్కసారి సక్సెసైతే వీటి వాణిజ్య విలువ ఆకాశాన్నంటుతుంది. అప్పుడిక ప్రపంచ ఇంధన రంగ ముఖచిత్రమే మారిపోవడం ఖాయం’’ అని పరిశోధక బృందం సారథి హెన్రీ స్నెయిత్ ధీమాగా చెబుతున్నారు!
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment