ఇంటిలో సోలార్ పవర్ ఉత్పత్తికి శ్రీకారం
సబ్సిడీతో పాటు రుణ సదుపాయం కల్పిస్తున్న కేంద్రం
పీఎం సూర్యఘర్‌కు విశాఖ సర్కిల్ పరిధిలో 452 దరఖాస్తులు
నెట్ మీటర్‌తో విద్యుదుత్పత్తి, వినియోగం తెలుసుకునే అవకాశం
కిలోవాట్ సోలార్ రూఫ్‌టాప్‌తో నెలకు 125 యూనిట్ల వరకూ విద్యుదుత్పత్తి
ఏ ఇంటికై నా నెల వచ్చిందంటే భయపెట్టేది కరెంటు బిల్లే. గృహ విద్యుత్తు దాదాపుగా ప్రతి రాష్ట్రంలోనూ వినియోగదారులకు భారంగానే మారుతోంది. ఈ నేపథ్యంలో గృహ వినియోగదారులు స్వయంగా విద్యుత్‌ని ఉత్పత్తి చేసుకుంటే కరెంటు బిల్లు బెడద లేకుండా హాయిగా ఉండొచ్చు. కేవలం విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవడమే కాదు.. మనం వాడుకోగా మిగిలిన కరెంటును ఎంచక్కా డిస్కంలకు అమ్మి సొమ్ము చేసుకునే ప్రయోజనం కూడా ఉంటుంది. భవిష్యత్ విద్యుత్ అవసరాల దృష్ట్యా కేంద్రం సరికొత్త విధానాలను అమల్లోకి తెచ్చింది. అందులో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తోంది. సోలార్ విద్యుత్ తయారీకి సబ్సిడీ, రుణ సదుపాయం కల్పించింది. ఆసక్తిదారులు ‘పీఎం సూర్యఘర్’ పథకం ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసుకునే సౌకర్యం కల్పించింది.
మన ఇంట్లోనే సూర్యరశ్మి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చేరాలంటే ముందుగా ‘సూర్యఘర్’ యాప్‌ని మొబైల్లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అందులో వివరాలు నమోదు చేయాలి. ఆరు నెలల కరెంటు బిల్లు కాపీని జతపరచాలి.
తరువాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యుత్ వాడకం 300 యూనిట్లలోపు మాత్రమే ఉండాలన్న నిబంధన ఉంది. తదుపరి ట్రాన్స్‌కో అనుమతులు పొందాక వెండర్లను ఎంపిక చేసుకోవాలి. ఇందులో కిలో వాట్‌కు నిర్ణయించిన దాని ప్రకారం రాయితీని అందిస్తారు. మిగిలిన మొత్తానికి బ్యాంకు రుణ సదుపాయం కల్పించనున్నారు. చివరగా ఇంటి రూఫ్‌పై 100 చదరపు అడుగుల స్థలంలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తారు.
ప్రస్తుతం వాడే మీటర్ స్థానంలో ‘నెట్ మీటర్’ ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా సోలార్ ఉత్పత్తి.. వినియోగదారుడు వాడుతున్న వి ద్యుత్‌ని గణిస్తారు. ఈపీడీసీఎల్‌లోని విశాఖపట్నం సర్కిల్‌లో ఇప్పటి వరకు 452 మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
రూ.78 వేల వరకు సబ్సిడీ..
కేంద్ర ప్రభుత్వ ప్రకటన ప్రకారం, ఒక కిలోవాట్ సోలార్ ప్యానెల్ సిస్టమ్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.30 వేలు సబ్సిడీ ఇస్తుంది. 2 కిలోవాట్ల ప్యానల్‌కు రూ.60 వేలు సబ్సిడీ, 3 కిలోవాట్ల సోలార్ ప్యానల్ సిస్టమ్‌కు రూ.78 వేలు సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీ పోను, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు వెచ్చించే అదనపు ఖర్చును బ్యాంక్‌లోన్ రూపంలో పొందొచ్చు. దీనిపై తక్కువ వడ్డీ తీసుకుంటారు. ఈ లోన్ కోసం బ్యాంక్‌లకు ప్రజలు ఎలాంటి పూచీకత్తు సమర్పించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రకటన ప్రకారం ఇంటి పైకప్పుపై గరిష్టంగా 3 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర ఫలకాలు బిగించుకోవడానికి 7% వడ్డీ రేటుతో కొలేటరల్ ఫ్రీ లోన్ (తాకట్టు లేని రుణం) అందుబాటులో ఉంటుంది.
30 రోజుల్లో రాయితీ..
నెట్ మీటర్ అమర్చిన తరువాత వినియోగదారులు ‘పోర్టల్’లో బ్యాంక్ ఖాతా వివరాలు అప్‌లోడ్ చెయ్యాలి. సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం 30 రోజుల్లోనే వినియోగదారుడికి చెల్లిస్తుంది. ఒక కిలో వాట్ రూఫ్ టాప్ కెపాసిటీ కోసం 3–4 ప్యానల్స్ (1 మీటరు వెడల్పు – 1.6 మీటర్ల ఎత్తు)ని అమర్చనున్నారు. ఒక కిలో వాట్ సోలార్ రూఫ్ టాప్ ప్యానల్ నెలకు దాదాపు 125 పైగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. సోలార్ రూఫ్ టాప్ ప్యానల్స్ సూర్యరశ్మిని నిలిపేసుకోవడం వల్ల ఇల్లు చల్లగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. వినియోగదారుడు పెట్టిన పెట్టుబడి ఆరు నుంచి ఏడేళ్లలో తిరిగి పొందగలరని అధికారులు చెబుతున్నారు.
సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అర్హతలు, అనర్హతలు..
– దరఖాస్తుదారుడు భారతీయ పౌరుడై ఉండాలి.
– వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలి.
– సోలార్ ప్యానెళ్ల వ్యవస్థ ఏర్పాటు చేయడానికి స్థలం ఉండాలి.
– దరఖాస్తుదారు వార్షిక వేతనం రూ. 1.5 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు.
– పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రాధాన్యత ఉంటుంది.
– దరఖాస్తుదారు గానీ, అతని కుటుంబంలో గానీ ప్రభుత్వ ఉద్యోగి/ఉద్యోగులు ఉంటే అనర్హులు.
– దరఖాస్తుదారు దగ్గర అవసరమైన సరైన పత్రాలు ఉండాలి.
– దరఖాస్తుదారు బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి.
అర్హులు దరఖాస్తు చేసుకోవాలి..
వినియోగదారులే సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా చూసే ‘సూర్యఘర్’ అద్భుతమైన పథకం. సోలార్ విద్యుత్ ప్యానళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ, రుణ సదుపాయం కల్పిస్తోంది. అర్హులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్ మీటర్ విధానం ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి అయ్యింది.. అందులో ఎంత మేర వినియోగిస్తున్నాం అనే వివరాలు కూడా సులువుగా తెలుసుకోవచ్చు. సందేహాలుంటే ట్రాన్స్‌కో అధికారులతో నివృత్తి చేసుకునే అవకాశం ఉంది.
దరఖాస్తు చేసేందుకు అవసరమైన పత్రాలు..
– ఆధార్ కార్డు నివాస ధ్రువీకరణ పత్రం
– విద్యుత్ బిల్లు బ్యాంకు పాస్ బుక్
– పాస్‌పోర్ట్ సైజు ఫొటో రేషన్ కార్డు
– మొబైల్ నంబర్ అఫిడవిట్
– ఆదాయ ధ్రువీవీకరణ పత్రం
– ఎల్.మహేంద్రనాథ్, ఈపీడీసీఎల్ ఎస్‌ఈ
Comments
Please login to add a commentAdd a comment