పాక్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మళ్లీ తన సొంత దేశానికి రావడానికి మార్గం సుగమం అయింది! చట్టసభ్యుల అనర్హతపై కాలపరిమితిని నిర్ణయిస్తూ పాక్ కేంద్ర అసెంబ్లీ చట్టం తీసుకువచ్చింది. పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ పాకిస్థాన్‌కు తిరిగి రావాలని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్న కొన్ని రోజుల తర్వాత ఈ మేరకు చట్టం తీసుకురావడం గమనార్హం.
చట్ట సభ‍్యులపై ఐదేళ్లకు మించి అనర్హత వేటు వేయడానికి అవకాశం లేనివిధంగా చట్టాన్ని సవరించినట్లు పాక్ ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. ఈ సవరణపై తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సిద్ధికీ సంజ్‌రాణి సంతకం కూడా చేసి ఆమోదించినట్లు స్పష్టం చేశారు. అయితే.. హజ్ యాత్రలో ఉన్న అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వీ లేని సమయంలో ఈ చట్టం తీసుకురావడం గమనార్హం.
ఇదీ చదవండి: హజ్‌యాత్ర ఎన్ని రోజులు ఉంటుంది? సౌదీ వెళ్లిన వారు అక్కడ ఏమి చేస్తారంటే..
బ్రిటన్‌లో నవాజ్ షరీఫ్..
అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తూ తీర్పును వెల్లడించింది. అయితే.. 2019లో ఆరోగ్య రీత్యా బెయిల్‌పై విడుదలయిన నవాజ్ షరీఫ్.. బ్రిటన్‌కు పారిపోయారు. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. పాక్ రాజకీయాలను బ్రిటన్ నుంచే తెరవెనక ఉండి శాసిస్తున్నాడని కొందరు విశ్వసిస్తారు.
మళ్లీ రాజకీయాల్లోకి..
గతేడాది విశ్వాస పరీక్షలో ఓడి ఇమ్రాన్ ఖాన్ పదవీత్యుడయ్యాక.. నవాజ్ షరీఫ్ సోదరుడు సెహబాజ్ షరీఫ్ పాక్ ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మాజీ ప్రధాని, తన సోదరున్ని స్వదేశానికి తీసుకురావాలని సెహబాజ్ ఇప్పటికే బహిరంగంగానే ప్రకటించాడు. నవాజ్ షరీఫ్ మళ్లీ ప్రధాని పదవి చేపట్టాలని అధికార PML-N పార్టీ కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. నవాజ్ షరీఫ్ రాజకీయంలోకి వస్తే పార్టీ బలోపేతం అవుతుందని అధికార పార్టీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: నవాజ్ పాక్ తిరిగొచ్చి, నాలుగోసారి ప్రధాని అవ్వాలి: షెహబాజ్ షరీఫ్
Comments
Please login to add a commentAdd a comment