పాక్‌లో ప్రాణాంతక వైరస్‌.. భారత్‌కూ ముప్పు? | Pakistan Teen Infected with Deadliest eye Bleeding Virus | Sakshi
Sakshi News home page

పాక్‌లో ప్రాణాంతక వైరస్‌.. భారత్‌కూ ముప్పు?

Published Wed, Aug 28 2024 12:53 PM | Last Updated on Wed, Aug 28 2024 1:01 PM

Pakistan Teen Infected with Deadliest eye Bleeding Virus

పాకిస్తాన్‌ను ఇప్పుడు మరోవైరస్‌ చుట్టుముట్టింది. ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక వ్యాధులలో ఒకటైన సీసీహెచ్‌ఎఫ్‌(క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్) కేసు పాక్‌లో వెలుగు చూసింది. దీనిని ఐ బ్లీడింగ్ వైరస్  అని కూడా అంటారు. ఈ వైరస్‌ బారినపడిన 14 ఏళ్ల బాలుని కంటి నుంచి రక్తం కారుతోంది. ప్రస్తుతం ఆ బాలునికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పాకిస్తాన్‌లో వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి భారతీయులనూ భయపెడుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) తెలిపిన వివరాల ప్రకారం, ఐ బ్లీడింగ్ వైరస్ లేదా క్రిమియన్ కాంగో హెమరేజ్ ఫీవర్ నివారించడం చాలాకష్టం.  చికిత్స కూడా  అంతసులభమేమీ కాదు. ఐ బ్లీడింగ్‌ వైరస్‌ తొలిసారిగా 1944లో క్రిమియన్ ద్వీపకల్పంలో కనిపించింది. 1956లో కాంగో బేసిన్‌లో ఈ వ్యాధికి సంబంధించిన పలు కేసులు కనిపించాయి. క్రిమియన్ కాంగో హెమరేజ్ ఫీవర్ సోకిన వారిలోని 80 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. టిక్‌ (పేలు తరహాలోని పరాన్న జీవి) కాటు ద్వారా ఈ వైరస్‌ వృద్ధి చెందుతుంది. సీసీహెచ్‌ఎఫ్‌ వైరస్ తల్లి నుండి  గర్భంలోని పిండానికి కూడా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ బారిన పడిన వ్యక్తి ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. 

సీసీహెచ్‌ఎఫ్‌ వైరస్ సోకినప్పుడు బాధితునిలో తేలికపాటి లక్షలాలు కనిపిస్తాయి. వైరస్ సోకిన జంతువులలో 12 రోజుల పాటు వ్యాధి కారకం సజీవంగా ఉంటుంది. అయితే బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. మనుషులకు ఈ వైరస్‌ సోకినప్పుడు  అధిక జ్వరం, కండరాల నొప్పి, కడుపు నొప్పి, కళ్ల నుంచి రక్తం కారడం, అవయవ వైఫల్యం, తల తిరగడం, వాంతుల రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

సీసీహెచ్‌ఎఫ్‌ అనేది ప్రాణాంతక వ్యాధి. దీని నివారణకు ఇంకా ఎటువంటి చికిత్స గానీ, వ్యాక్సిన్‌ గానీ అందుబాటులోకి రాలేదు. వైద్యులు బాధితులను క్వారంటైన్‌లో ఉంచి, వ్యాధి లక్షణాలను తొలగించే ప్రయత్నం చేస్తారు. సీసీహెచ్‌ఎఫ్‌ సోకినవారిలో 50 శాతం మంది మృతి చెందుతున్నారు. ఈ వ్యాధికి దూరంగా ఉండాలంటే వ్యాధి నివారణ ఒక్కటే మార్గం. ఈ వైరస్‌ బారిన పడిన వ్యక్తికి దూరంగా ఉండటం, వ్యాధి వ్యాప్తి చెందిన ప్రాంతానికి వెళ్లకుండా ఉండటం ద్వారా వ్యాధిని నివారించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement