పాకిస్తాన్ ఈరోజు(ఆగస్టు 14)న 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటోంది. అయితే ఈ సమయంలోనూ పాక్‌లో విషాదం చోటుచేసుకుంది. కొందరు ఉగ్రవాదులు బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో జాతీయ జెండాలు విక్రయిస్తున్న దుకాణంతో పాటు ఒక ఇంటిపై గ్రెనేడ్‌లతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో జరిగిన ఈ దాడికి తామే బాధ్యులమంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం ఈ గ్రూప్ జాతీయ జెండాలను విక్రయించవద్దని, ఆగస్టు 14న సెలవుదినాన్ని జరుపుకోవద్దని దుకాణాల యజమానులను హెచ్చరించింది. కాగా ఈ దాడిలో గాయపడిన ఆరుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మిలిటరీ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ సహకారం అందించాలన్నారు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దాడులు తీవ్రమయ్యాయి. 2022, 2023లలో కూడా పాక్ జెండాలను విక్రయిస్తున్న దుకాణాలపై దాడులు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment