కాక్రోచ్ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇంట్లో ఒక్క బొద్దింక కనబడితేనే దాన్ని చంపేదాకా మనసూరుకోదు. అలాంటిది ఇంటినిండా బొద్దింకలను ఒక నెలపాటు ఉంచడానికి... రెండు వేల డాలర్లు (సుమారు రూ.1,58,283) ఆఫర్ చేసిందో కంపెనీ. అందుకు 2,500మంది అంగీకరించారు కూడా. బొద్దింకలను పెంచమని ప్రోత్సహించ డం ఏంటనుకుంటున్నారా? వాటిని నిర్మూలించడానికి. అయితే పెంచడమెందుకు అంటే శాశ్వత నిర్మూలన ప్రయోగం కోసం. గతవారం నార్త్ కరోలినాకు చెందిన హైబ్రిడ్ పెస్ట్ కంట్రోల్/మీడియా కంపెనీ ‘ద పెస్ట్ ఇన్ఫార్మర్’ఒక ప్రకటన విడుదల చేసింది.
30 రోజులపాటు 100 అమెరికన్ బొద్దింకలను ఉంచి పరిశోధించడానికి ఏడు ఇళ్లు కావాలని తెలిపింది. ఆమోదం తెలిపేవాళ్ల వయసు 21ఏళ్లు నిండి ఉండాలి. సొంత ఇల్లు కలిగి ఉండాలి లేదా ఇంటి ఓనర్ ఆమోదం ఉన్నా సరిపోతుందని చెప్పింది. అలాగే వాటి నిర్మూలనకు ఎలాంటి పురుగుల మందులు వాడకూడదని, తాము ఇచ్చిన మందులను మాత్రమే ప్రయోగించాలని వివరించింది.
వాళ్లు తయారు చేసిన పురుగుల మందు 30 రోజుల్లో ఆ బొద్దింకలను పూర్తిగా చంపలేకపోతే... 30 రోజుల తరువాత సాధారణ పద్ధతిలో వాటిని నిర్మూలిస్తారు. ఈ మొత్తం ప్రక్రియకు వారికి రెండు వేల డాలర్లు అంటే దాదాపు రూ.లక్షా60వేలు ఇస్తామని పేర్కొన్నది. ఎవ్వరూ ఆసక్తి చూపరేమోనని జూలై 31వరకు గడువు విధించింది. వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ.. 2,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. అది చూసి ఆశ్చర్యపోవడం కంపెనీ వంతయ్యింది. ఎవరూ ఆసక్తిచూపరని తామనుకుంటే... ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలోంచి తమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నవారిని ఎంపిక చేసుకుంటామని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment