ఆదివారం తొలి ప్రయాణానికి పూర్తిస్థాయిలో ముస్తాబైన ప్రపంచంలోకెల్లా అతి పెద్ద విలాస నౌక ఐకాన్ ఆఫ్‌ద సీస్
అది ప్రపంచంలోకెల్లా అతి పెద్ద విహార నౌక. పేరు ఐకాన్ ఆఫ్ ద సీస్. పొడవు 365 మీటర్లు. బరువు 2.5 లక్షల టన్నుల పై చిలుకు. 20 డెక్కులు, ప్రపంచంలోకెల్లా అతి పెద్ద వాటర్ పార్కు, స్విమింగ్ పూల్స్ వంటి లెక్కలేనన్ని ఆకర్షణలు దాని సొంతం. ఒక్క మాటలో చెప్పాలంటే అదో మినీ ప్రపంచం.
కళ్లు చెదిరే స్థాయిలో సర్వ సదుపాయాలున్న ఈ లగ్జరీ క్రూయిజ్ ఆదివారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 10న అమెరికాలో మియామీ బీచ్‌లో అంగరంగ వైభవంగా జలప్రవేశం చేసింది. ఆదివారం నుంచే వారం రోజుల పాటు తొలి పర్యటనకు బయల్దేరుతోంది. కరీబియన్ దీవుల్ని చుడు తూ ప్రయాణం సాగనుంది. ఈ ట్రిప్‌కు టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడైనట్టు నిర్మాణ సంస్థ రాయల్ కరేబియన్ ప్రకటించింది.
ఈ భారీ నౌకలో విశేషాలెన్నో...
► ఈ నౌక నిర్మాణానికి 200 కోట్ల డాలర్లకు పైగా ఖర్చయిందట. ఫిన్లండ్‌లోని మెయర్ తుర్క్ షిప్‌యార్డులో దీని నిర్మాణం జరిగింది.
► ఈ విలాస నౌక టైటానిక్ కంటే ఏకంగా ఐదు రెట్లు పెద్దది.
► ఇందులో ఏకంగా 7,960 మంది హాయిగా ప్రయాణించవచ్చు. 2,350 మంది సిబ్బందితో కలిపి దాదాపు 10 వేల మందికి పైగా పడతారు!
► 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతి పెద్ద వాటర్ పార్కు ఈ నౌక సొంతం.
► 16, 17 అంతస్తులను పూర్తిగా వాటర్ పార్కుకే కేటాయించారు.
► వాటిలో లెక్కలేనన్ని వాటర్ గేమ్స్‌ను ఆస్వాదించవచ్చు. ఒళ్లు గగుర్పొడిచే అడ్వెంచర్ గేమ్స్ కూడా ఉన్నాయట. ఇక ఏడు సువిశాలమైన స్విమ్మింగ్ పూల్స్ అదనపు ఆకర్షణ.
► మరీ గుండెలు తీసిన బంట్లయితే 20వ అంతస్తు నుంచి నేరుగా సముద్రంలోకి డైవింగ్ చేయడం వంటి పలు సాహసాలు కూడా చేయవచ్చు.
► ప్రత్యేకంగా రూపొందించిన ఐస్ ఎరీనాలో స్కేటింగ్ కూడా చేయవచ్చు! మినీ గోల్ఫ్ కోర్సూ ఉంది.
► పలు థీమ్ పార్కులు, సువిశాలమైన 40 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత రుచులన్నింటినీ ఆస్వాదించవచ్చు. వీటిలో 21 కాంప్లిమెంటరీ తరహావి. వాటిలో ఏం తిన్నా, తాగినా అంతా ఉచితమే.
► అత్యాధునిక సినిమా థియేటర్లలో సినిమాలు మొదలుకుని లైవ్ మ్యూజిక్ షోల దాకా అన్నీ అందుబాటులో ఉంటాయి.
► 55 అడుగుల ఎత్తైన ఇండోర్ జలపాతం నౌకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
► ఈ నౌకను పూర్తిగా కలియదిరిగి చూసేందుకే కనీసం 10 రోజులు పడుతుందట!
► ఆదివారం మొదలయ్యే తొలి ప్రయాణం కరేబియన్ దీవుల్లో బహమాస్, హోండురస్‌ల గుండా ఏడు రాత్రులు, ఆరు పగళ్లు సాగుతుంది.
► ఈ నౌక ప్రధానంగా లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ)తో నడుస్తుంది.
► 90 శాతానికి పైగా తాగునీటి అవసరాలను ఆర్వో పద్ధతిలో సముద్ర జలాల ద్వారానే తీర్చుకుంటుంది.
► ఐకాన్ ఆఫ్ ద సీస్‌లో ప్రయాణానికి ఔత్సాహికులు ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. 2022 అక్టోబర్లో దీని తొలి ఫొటోలు బయటికి వచి్చనప్పటి నుంచే జనాలు విపరీతంగా ఆసక్తి చూపడం మొదలైంది. టికెట్లను ఆన్‌లైన్లో అందుబాటులో పెట్టీ పెట్టడంతోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
► నిజానికిది రెండేళ్ల క్రితమే అందుబాటులోకి రావాల్సిందట. కరోనా కారణంగా ఆలస్యమైంది.
► ఇందులో రకరకాల ప్యాకేజీల్లో 2,805 గదులు, విశాలమైన లగ్జరీ కుపేలు అందుబాటులో ఉంటాయి.
► వాటి ఖరీదు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే! అతి తక్కువ ప్యాకేజీయే 3 వేల డాలర్ల (దాదాపు రూ.2.5 లక్షల) నుంచి మొదలవుతుంది. 2 లక్షల డాలర్లు, అంతకు మించిన ప్యాకేజీలూ ఉన్నాయి!
► ఐకాన్ ఆఫ్ ద సీస్‌ను కూడా తలదన్నే స్థా యిలో స్టార్ ఆఫ్ ద సీస్ పేరుతో మరో అతి విలాసమైన నౌకను నిర్మిస్తామని రా యల్ కరేబియన్ ఇప్పటికే ప్రకటించింది.
► దీనికి ముందు అతి పెద్ద లగ్జరీ నౌకగా రికార్డుకెక్కిన వండర్ ఆఫ్ ద సీస్‌ను కూడా రాయల్ కరేబియనే నిర్మించింది. దాని బరువు 2.35 లక్షల టన్నులు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment