పేషంట్లను కాపాడుతున్న సహాయక సిబ్బంది (ఫోటో కర్టెసీ: ఇండియా.కామ్)
మాస్కో: మన చుట్టు పక్కల ఎప్పుడైనా.. ఎక్కడైనా ప్రమాదం జరిగితే చాలు.. ఎవరికి వారు క్షేమంగా బయటపడాలని ఆలోచిస్తారు. ప్రాణభయంతో పరుగులు తీస్తారు. ఎక్కడో కొందరు మాత్రం తమ ప్రాణాలు పణంగా పెట్టి ఇతరులను కాపాడతారు. ఇలాంటి ఘటనే ఒకటి రష్యాలో చోటు చేసుకుంది. ఓ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. సహాయక సిబ్బంది ఆస్పత్రిలో ఉన్న వారిని క్షేమంగా బయటకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో ఓ వ్యక్తికి గుండె ఆపరేషన్ చేస్తున్నారు కొందరు వైద్యులు. ప్రమాదం గురించి తెలిసినప్పటికి వారు అక్కడి నుంచి వెళ్లిపోలేదు. విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసి.. తమతో పాటు రోగిని కూడా క్షేమంగా బయటకు తరలించారు. ఆ వివరాలు.. రష్యాలోని బ్లేగోవెష్చెన్స్క్‌లోని ఓ ఆస్పత్రిలో శుక్రవారం మంటలు చెలరేగాయి. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది ఆస్పత్రిలో ఉన్న 120 మందిని క్షేమంగా బయటకు తరలించారు.
ఇదే సమయంలో హస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఓ వ్యక్తికి ఒపెన్ హార్ట్ సర్జరీ జరుగుతుంది. దాదాపు 8 మంది వైద్యులు ఆపరేషన్ థియేటర్‌లో ఉన్నారు. ప్రమాదం గురించి తెలిసి వారు భయపడలేదు. సర్జరీ కొనసాగించాలని భావించారు. అయితే అగ్ని ప్రమాదం వల్ల ఆస్పత్రిలో పవర్ కట్ చేశారు. దాంతో ఓ విద్యుత్ వైరును సర్జరీ చేస్తున్న గదికి కనెక్ట్ చేసి పవర్ సప్లై చేశారు. ఇక ప్రమాదం వల్ల ఆపరేషన్ థియేటర్‌లోకి పొగ చేరడంతో అప్పిటికప్పుడు దాన్ని బయటకు పంపించే అధునాతన పరికరాలను ఏర్పాటు చేసి.. ఏలాంటి ఆటంకం లేకుండా ఆపరేషన్ కొనసాగేలా చూశారు. వైద్యులు తమ ప్రాణాలు పణంగా పెట్టి సదరు పెషేంట్ జీవితాన్ని నిలబెట్టారు. విజయవంతంగా సర్జరీ పూర్తి చేసి.. తమతో పాటు సదరు రోగిని కూడా క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం అతడిని మరొక ఆస్పత్రికి తరలించారు.
ప్రాణాలు పణంగా పెట్టి మరి వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిన వైద్యులపై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు. ఈ సందర్భంగా ఓ వైద్యుడు మాట్లాడుతూ.. ‘‘ఇందులో మా గొప్పతనం ఏం లేదు. మా విధులు మేం నిర్వర్తించాం. కాకపోతే ఇది కాస్త రిస్కీ ఆపరేషన్. అదృష్టం కొద్ది మాతో పాటు పేషెంట్‌ని కూడా కాపాడగలిగాం’’ అన్నాడు. ప్రమాద దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
చదవండి:
మూడు రోజుల చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్స
10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి..
Comments
Please login to add a commentAdd a comment