మాస్కో: రష్యా అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీ ఖరారైంది. 2024 మార్చి 17న ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనపై రష్యా ఎగువ సభ ఫెడరేషన్ కౌన్సిల్ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో, అధికారికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమయినట్లేనని స్పీకర్ వలెంటినా మట్వియెంకో ప్రకటించారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన 71 ఏళ్ల వ్లాదిమిర్ పుతిన్ మరో విడత పోటీ చేస్తానంటూ అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు.
ఎన్నికల తేదీ ఖరారైనందున, ఐదో సారీ ఆయన బరిలో ఉంటారని భావిస్తున్నారు. ఆరేళ్ల ఆయన పదవీ కాలం 2024లో ముగియాల్సి ఉంది. కానీ, పుతిన్ తీసుకువచి్చన రాజ్యాంగ సంస్కరణల ప్రకారం 2024 తర్వాత మరో రెండు పర్యాయాలు అంటే 2036 వరకు అధికారంలో కొనసాగేందుకు వీలుంది. రాజకీయ అధికార యంత్రాంగంపై పూర్తి స్థాయిలో పట్టున్న పుతిన్ మార్చిలో జరిగే ఎన్నికల్లో మరో విడత ఎన్నిక కావడం తథ్యమని భావిస్తున్నారు. ఆయన ప్రత్యర్థులుగా భావిస్తున్న వారు జైళ్లలోనో, విదేశాల్లోనో ఉండిపోయారు.
చాలా వరకు స్వతంత్ర మీడియా సంస్థలపై నిషేధాలు, నియంత్రణలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పుతిన్‌ను ఎదుర్కొనే వారెవరనే విషయం ఇంకా వెల్లడికాలేదు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగనున్నట్లు ఇప్పటి వరకు ప్రకటించిన ఇద్దరిలో, మాస్కో ప్రాంత మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు బోరిస్ నదేజ్దిన్, జర్నలిస్ట్, లాయర్ అయిన యక్తెరినా దుంట్‌సోవా ఉన్నారు. ఉక్రెయిన్‌తో ఏడాదికి పైగా కొనసాగుతున్న యుద్ధం, ప్రైవేట్ సైన్యాధిపతి యెవ్‌గెనీ ప్రిగోజిన్ విఫల తిరుగుబాటు వంటివి పుతిన్ ప్రజాదరణపై పెద్దగా ప్రభావం చూపుతున్న దాఖలాలు ఏవీ లేవని పరిశీలకులు అంటున్నారు.
అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకునే వారు.. రష్యా దిగువ సభ డూమాలో గానీ కనీసం మూడో వంతు ప్రాంతీయ శాసనసభలలో ప్రాతినిధ్యం లేని పార్టీ ద్వారా 40 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల నుంచి కనీసం లక్ష సంతకాలను సేకరించాలి. ఏ పారీ్టకీ సంబంధం లేకుండా పోటీ చేసే వారికి కనీసం 40 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల నుంచి 3 లక్షల సంతకాలు అవసరం. ఈ నిబంధనలు పుతిన్‌కు సైతం వర్తిస్తాయి. 2018లో స్వతంత్రుడిగా పోటీ చేసిన పుతిన్ తరఫున ప్రచారకర్తలు సంతకాలు సేకరించారు. 2012 ఎన్నికల్లో యునైటెడ్ రష్యా పార్టీ ఆయనను నామినేట్ చేసింది. దీంతో, సంతకాల సేకరణ అవసరం లేకుండాపోయింది.
Comments
Please login to add a commentAdd a comment