మైకోలైవ్‌లో మిలటరీ స్కూల్ శిథిలాల నుంచి మృతదేహాన్ని వెలికితీసిన దృశ్యం
కీవ్: యుద్ధానికి తెర తీసి మూడున్నర వారాలైనా విజయం అందని ద్రాక్షే కావడంతో రష్యా చిర్రెత్తిపోతోంది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే అత్యాధునిక హైపర్ సోనిక్ క్షిపణి ‘కింజల్’తో ఉక్రెయిన్ సైనిక ఆయుధాగారంపై శుక్రవారం అర్ధరాత్రి విరుచుకుపడింది. పశ్చిమ ఉక్రెయిన్‌లో రొమేనియా సరిహద్దు సమీపంలోని ఇవనో–ఫ్రాంకివ్స్‌క్ ప్రాంతంలో క్షిపణులు, వైమానిక ఆయుధాలను నిల్వ చేసే భారీ భూగర్భ ఆయుధాగారాన్ని కింజల్ పూర్తిగా ధ్వంసం చేసిందని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనషెంకోవ్ ప్రకటించారు.
రేవు పుట్టణం ఒడెసా సమీపంలోని ఉక్రెయిన్ సైనిక స్థావరాలను కూడా యాంటీ షిప్ మిసైల్ సిస్టం సాయంతో క్షిపణి ప్రయోగాలతో నేలమట్టం చేసినట్టు చెప్పారు. అణ్వాయుధాలనూ మోసుకుపోగల కింజల్‌ను రష్యా యుద్ధంలో ప్రయోగించడం ఇదే తొలిసారి. అయితే శుక్రవారం నాటి దాడిలో సాంప్రదాయిక వార్ హెడ్‌నే వాడారు. మిగ్–31 ఫైటర్ జెట్ ద్వారా క్షిపణిని ప్రయోగించారు. డెలియాటిన్ సెటిల్మెంట్లోని తమ ఆయుధాగారంపై క్షిపణి దాడి నిజమేనని ఉక్రెయిన్ చెప్పింది.
మారియుపోల్‌లో ఉన్న యూరప్‌లోని అతి పెద్ద స్టీల్ ప్లాంట్ అజోవ్‌స్టాల్ కూడా రష్యా సైన్యం దాడిలో దాదాపుగా నేలమట్టమైందని ప్రకటించింది. దేశవ్యాప్తంగా భూ, గగన తలాల గుండా రష్యా భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని కీవ్‌తో పాటు ఖర్కీవ్, మారియుపోల్, అవ్డివ్కా, క్రమటోర్స్‌క్, పొక్రోవ్స్‌క్, నొవొసెలిదివ్కా, వెర్కోనొటొరెస్కే, క్రిమ్కా, స్టెప్నే, లివివ్ తదితర నగరాలు బాంబుల దాడితో వణికిపోతున్నాయి.
నివాస ప్రాంతాలపై కూడా రష్యా సైన్యం విచక్షణారహితంగా దాడులకు తెగబడుతోందని ఉక్రెయిన్ దుయ్యబట్టింది. స్కూళ్లు, ఆస్పత్రులు, మ్యూజియాలు, షాపింగ్ సెంటర్లు వేటినీ వదలడం లేదని ఆరోపించింది. మారియుపోల్ దాదాపుగా రష్యా చేతుల్లోకి వెళ్లిన నేపథ్యంలో అజోవ్ సముద్రంతో ఉక్రెయిన్‌కు సంబంధం తెగిపోయిందంటున్నారు. దక్షిణ ఉక్రెయిన్లోని మైకోలైవ్‌లో ఓ సైనిక స్థావరంపై రష్యా జరిపిన దాడుల్లో 100 మందికి పైగా మరణించినట్టు సమాచారం. 50కి పైగా మృతదేహాలను వెలికితీశారు. దాడి సమయంలో రెజిమెంట్లో 200 మంది దాకా ఉన్నట్టు తెలుస్తోంది.
పాపం పిల్లలు!
ఉక్రెయిన్ నుంచి వలసల సంఖ్య 40 లక్షలు దాటినట్టు సమాచారం. దేశ జనాభాలో ఇది దాదాపు 10 శాతం! 75 లక్షల ఉక్రెయిన్ బాలల్లో సెకనుకు ఒకరి చొప్పున శరణార్థిగా మారుతున్నారు.
మరో 10 కారిడార్లు
కీవ్, మారియుపోల్, లుహాన్స్‌క్, రష్యా అధీనంలోని ఖెర్సన్ సహా పలు నగరాల్లో 10 హుమానిటేరియన్ కారిడార్లకు రష్యాతో అంగీకారం కుదిరినట్టు ఉక్రెయిన్ తెలిపింది. నిత్యావసరాల సరఫరాను రష్యా సైన్యం అడ్డుకుంటోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. ఇప్పటికైనా తనతో నేరుగా చర్చలకు రావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచించారు.
తటస్థ హోదాకు ఉక్రెయిన్ ఓకే: రష్యా
నాటో సభ్యత్వ డిమాండ్‌ను వదులుకునేందుకు, తటస్థ దశంగా కొనసాగేందుకు ఉక్రెయిన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు చర్చల్లో రష్యా బృందానికి నేతృత్వం వహించిన వ్లాదిమిర్ మెడిన్‌స్కీ శుక్రవారం చెప్పారు. కానీ తమ వైఖరిలో మార్పూ లేదని ఉక్రెయిన్ స్పష్టం చేసింది.
ఉక్రెయిన్ దుస్తుల్లో రష్యా వ్యోమగాములు?
శుక్రవారం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్)కు వెళ్లిన ముగ్గురు రష్యా వ్యోమగాములు ఉక్రెయిన్ జెండాతో సరిపోలే నీలి, పసుపు రంగు స్పేస్ సూట్లు ధరించి కన్పించారు! ‘‘ఏ రంగు సూట్లు ఎంచుకోవాలన్నది మా ఇష్టం. పసుపు రంగు సూట్లు మా దగ్గర చాలా పోగుపడ్డాయి. దాంతో అవే వేసుకోవాల్సి వచ్చింది’’ అని వాళ్లు చెప్పారు. ఉక్రెయిన్‌కు నైతిక మద్దతుగానే ఈ పని చేశారా అన్నది తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment