కీవ్: ఉక్రెయిన్‌తో సంఘర్షణ మూడో ప్రపంచ యుద్ధంగా పరిణమించే ప్రమాదం పొంచి ఉందని రష్యా అభిప్రాయపడింది. ఉక్రెయినే తన తీరుతో ఆ దిశగా రెచ్చగొడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అణు యుద్ధ ముప్పును అస్సలు కొట్టిపారేయలేమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఘాటు హెచ్చరికలు చేశారు. ఉక్రెయిన్‌పై దాడులను ఏ మాత్రమూ కొనసాగించలేనంతగా రష్యాను బలహీనపరచడమే అమెరికా లక్ష్యమన్న ఆ దేశ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.
మూడో ప్రపంచ యుద్ధం రావొద్దంటూ శాంతి మంత్రం పఠిస్తున్న చాలా దేశాలు తమ ప్రవర్తన ద్వారా చేజేతులారా అందుకు రంగం సిద్ధం చేస్తున్నాయంటూ అమెరికా, పాశ్చాత్య దేశాల తీరును దుయ్యబట్టారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలందించడం ద్వారా నాటో దేశాలే అగ్నికి ఆజ్యం పోస్తున్నాయంటూ తీవ్ర విమర్శలకు దిగారు. రష్యాతో ఒప్పందం చేసుకోవద్దంటూ ఉక్రెయిన్‌పై అమెరికా, ఇంగ్లండ్ ఒత్తిడి తెస్తున్నాయన్నారు. చర్చలు ఆగిపోవడానికి ఉక్రెయినే కారణమని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను అమెరికా, ఇంగ్లండ్ తీవ్రంగా ఖండించాయి. లావ్రోవ్‌వి మతిలేని వ్యాఖ్యలంటూ దుయ్యబట్టాయి. ‘అణు యుద్ధంలో విజేతలంటూ ఎవరూ ఉండరు. చేయకూడని యుద్ధమది’’ అని పెంటగాన్ ప్రెస్ సెక్రెటరీ జాన్ కిర్బీ అన్నారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని చూడాలని ఎవరూ కోరుకోరని చైనా పేర్కొంది.
40 దేశాల మంత్రుల భేటీ
ఉక్రెయిన్‌కు కావాల్సినంత సైనిక సాయం అందిస్తామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ స్పష్టం చేశారు. 40 దేశాలరక్షణ మంత్రులు, అధికారులతో జర్మనీలో ఆయన సమాలోచనలు జరిపారు. ఉక్రెయిన్‌కు 500 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు పంపేందుకు అంగీకారం కుదిరిందని చెప్పారు. అత్యాధునిక జెపార్డ్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్ పంపుతామని జర్మనీ ప్రకటించింది.
దాడులు మరింత ఉధృతం
తమ భూభాగాలపై దాడులకు దిగేలా ఉక్రెయిన్‌ను ఇంగ్లండ్ రెచ్చగొడుతోందని రష్యా రక్షణ శాఖ ఆరోపించింది. కీవ్‌లోని కీలక ప్రభుత్వ కార్యాలయాలపై విరుచుకుపడతామని హెచ్చరించింది. పొపాస్నా, లిసిచాన్స్‌క్, గిర్‌స్కే, ఖరీ్కవ్, జపోరిజియాలపై బాంబుల వర్షం కురిపించింది. క్రెమినా నగరం రష్యా వశమైందని ఇంగ్లండ్ పేర్కొంది. యుద్ధం ద్వారా ఉక్రెయిన్‌ను పాశ్చాత్య దేశాలకు పుతినే దగ్గర చేశారని విశ్లేషకులంటున్నారు.
శాంతియుత పరిష్కారమే కోరుతున్నాం: గుటెరస్‌తో పుతిన్
సంక్షోభానికి శాంతియుత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్టు పుతిన్ చెప్పారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌తో ఆయన భేటీ అయ్యారు. ‘‘చర్చల్లో చాలా పురోగతి సాధించినా ఉక్రెయిన్ వైఖరి ప్రతిష్టంభనకు దారి తీసింది. క్రిమియా హోదా, డోన్బాస్‌పై వైఖరి మార్చుకుంది. ఇప్పటికైనా క్రిమియాపై రష్యా సార్వభౌమత్వాన్ని డోన్బాస్‌కు స్వాతంత్య్రాన్ని ఉక్రెయిన్ గుర్తించాలి’’ అని డిమాండ్ చేశారు. గుటెరస్ అంతకుముందు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో కూడా భేటీ అయ్యారు. యుద్ధాన్ని తక్షణం విరమించాలని సూచించారు.
ఇది చదవండి: పుతిన్ కొత్త ప్లాన్..?
Comments
Please login to add a commentAdd a comment