వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం మంగళవారం ఓ అరుదైన ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. మరో రెండు నెలల్లో ఎన్నికలను ఎదుర్కోనున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశీ ఓటర్ల మద్దతుపై దృష్టి సారించిన నేపథ్యంలో.. ఐదు దేశాలకు చెందిన వారికి అమెరికా పౌరసత్వాన్ని అందించే కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించారు. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ జరిగిన రెండో రోజు రాత్రే ఈ వేడుక జరగడం విశేషం. ఈ కార్యక్రమంలో ఇండియా, బొలీవియా, లెబనాన్, సూడాన్, ఘనా దేశాలకు చెందిన ఐదుగురు యూఎస్ పౌరసత్వాన్ని స్వీకరించారు. వీరిలో ఇండియాకు చెందిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ సుధా సుందరి నారాయణన్ కూడా ఉన్నారు. కుడిచేతిని పైకి లేపి చూపుతూ, మరో చేత్తో అమెరికా జెండాను పట్టుకున్న వీరు, అమెరికా పౌరులమని సంప్రదాయ ప్రమాణాన్ని చేశారు. ట్రంప్ పక్కనే నిలబడి చూస్తుండగా, హోమ్ లాండ్ సెక్యూరిటీ విభాగం కార్యదర్శి చాడ్ వోల్ఫ్ వారితో ప్రమాణం చేయించారు. (చదవండి: మరో నాలుగేళ్లు ట్రంప్‌కు అవకాశమివ్వండి)
వర్ణ, మత వివక్షలేని అద్భుతమైన దేశానికి స్వాగతం అంటూ ట్రంప్ వీరందరిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఐదుగురు అసాధారణ వ్యక్తులను అమెరికా తన కుటుంబంలోకి నేడు సాదరంగా ఆహ్వానిస్తోంది. ఇందుకు మేం ఎంతో సంతోషిస్తున్నాం. ఇక మీరంతా ఓ గొప్ప దేశ సభ్యులుగా ఉండబోతున్నారు. నేటి నుంచి మీరు మా తోటి పౌరులు. మీకు ఇవే నా శుభాకాంక్షలు. అమెరికా రంగును, మతాన్ని చూడబోదని చెప్పడానికి ఇంతకన్నా మంచి నిదర్శనం లేదు. యూఎస్‌ఏ బిల్ ఆఫ్ రైట్స్ ఇప్పుడు మీకు మద్దతు ఇస్తుంది, రక్షిస్తుంది. పౌరులుగా, మీరు ఇప్పుడు ఈ అద్భుతమైన దేశానికి సేవకులుగా ఉన్నారు’ అని తెలిపారు ట్రంప్. అమెరికా ఓ అద్భుత దేశమని కొనియాడారు. (చదవండి: ఇదో ‘ఫ్రెంచి’ బంధం)
పౌరసత్వం పొందిన వారందరి పేర్లను చదువుతూ వివరాలు వెల్లడించిన ట్రంప్, ఇండియాలో జన్మించి, 13 సంవత్సరాల క్రితం అమెరికాకు వచ్చిన సుధ, ఇప్పటికే తన కెరీర్‌లో అద్భుతమైన విజయాలను సాధించారని కొనియాడారు. ఆమెకు ఎంతో టాలెంట్ ఉందని, సుధా దంపతులు అమెరికాకు ఎంతో సేవ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి గులాబీ రంగు చీర కట్టుకుని వచ్చిన సుధా సుందరి, ట్రంప్ చేతుల మీదుగా పౌర పట్టాను అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment