పంది మాంసంతో పార్లమెంటులో రచ్చ | Taiwan Lawmakers Fight In Parliament Throw Pig Guts | Sakshi
Sakshi News home page

మాంసం ముద్దలు విసురుతూ నిరసన

Nov 28 2020 8:53 AM | Updated on Nov 28 2020 11:53 AM

Taiwan Lawmakers Fight In Parliament Throw Pig Guts - Sakshi

పార్లమెంటులో రసాభాస(ఫొటో కర్టెసీ: అసోసియేటెడ్‌ ప్రెస్‌)

తైపీ: పంది మాంసం, బీఫ్‌ దిగుమతి విషయంలో విధానాల రూపకల్పన గురించి చర్చించే క్రమంలో తైవాన్‌ పార్లమెంటులో రసాభాస చోటుచేసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షం పంది అవయాలు, మాంసాన్ని అధికార పార్టీ నాయకులపై విసిరారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వివరాలు... చైనాకు కంటిలో నలుసులా తయారైన తైవాన్‌ గత కొన్ని రోజులుగా అగ్రరాజ్యం అమెరికాతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. దౌత్యపరంగా ఇరు దేశాల మధ్య అధికారికంగా ఎలాంటి ఒప్పందాలు లేనప్పటికీ డబ్ల్యూహెచ్‌ఓలో సభ్యత్వం, రక్షణ రంగం తదితర అంశాల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తైవాన్‌కు అండగా నిలిచింది. 

ఈ క్రమంలో అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌- వెన్‌ అమెరికాతో వాణిజ్య బంధం ఏర్పరచుకునేందుకు సంకల్పించారు. ఇందులో భాగంగా పంది మాంసాన్ని దిగుమతి చేసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే తైవాన్‌లో పోర్క్‌పై గత కొన్నేళ్లుగా నిషేధం ఉంది. దీనిని ఎత్తివేస్తూ ఆగష్టులో నిర్ణయం తీసుకున్న త్సాయి సర్కారు, జనవరి నుంచి అమల్లోకి వచ్చేలా విధానాలు రూపొందించింది. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రీమియర్‌ సూ త్సెంగ్‌- చాంగ్‌ శుక్రవారం పార్లమెంటు ఎదుట ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేషనలిస్టు పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పంది మాంసాన్ని సభలోకి తీసుకువచ్చి, అధికార డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పా(డీపీపీ) నాయకుల ముందు విసిరికొట్టగా.. వారు సైతం దీటుగానే బదులిచ్చారు. (చదవండి: తైవాన్‌పై దాడికి చైనా కుట్ర!)

అధికారంలోకి రాగానే మద్దతు!
ఈ ఘర్షణలో సహనం కోల్పోయిన డీపీపీ నేత ప్రతిపక్ష నేతతో మల్లయుద్ధానికి దిగారు. ఈ విషయం గురించి  నిరసనకు నాయకత్వం వహించిన నేషనలిస్ట్‌ పార్టీ నేత లిన్‌ వే- చౌ మాట్లాడుతూ.. ‘‘మీరు ప్రతిపక్షంలో ఉన్నపుడు అమెరికా పోర్క్‌ను వ్యతిరేకించారు. అధికారంలోకి రాగానే మాటమార్చారు. యూఎస్‌కు మద్దతు తెలుపుతున్నారు’’ అంటూ త్సాయి ఇంగ్‌-వెన్‌ పార్టీని విమర్శించారు. అయితే డీపీపీ నేతలు మాత్రం ప్రీమియర్‌ను అడ్డుకోవడం సరికాదని, శాంతియుత వాతావరణంలో ఈ విషయం గురించి చర్చించాలంటూ విజ్ఞప్తి చేయడం విశేషం. కాగా పోర్క్‌, బీఫ్‌ వినియోగంపై నిషేధాన్ని ఎత్తివేయడం పట్ల ప్రతిపక్షాలతో పాటు ప్రజల నుంచి కూడా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది.(చదవండి: అమెరికాపై డ్రాగన్‌ ఫైర్.. తైవాన్‌ కౌంటర్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement