సాక్షి, అమరావతి: ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని ఖార్కీవ్ నగరంలో గడ్డకట్టే చలితో పాటు బాంబుల మోత తెలుగు విద్యార్థులను వణికిస్తోంది. గురువారం ఉష్ణోగ్రత మైనస్ 2 డిగ్రీలు ఉండగా శుక్రవారం ఒక్కసారిగా మైనస్ 6 డిగ్రీలకు పడిపోయింది. ఒకవైపు దట్టమైన మంచు కురుస్తుంటే.. మరోవైపు మిసైల్ దాడులతో నగరం అగ్నిగుండంగా మారింది. కళ్లముందు పేలుతున్న బాంబులను చూస్తూ.. ఎముకలు కొరికే చలికి వణుకుతూ తెలుగు విద్యార్థులు కట్టుబట్టలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బంకర్లు, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. కనీసం కప్పుకోవడానికి బ్లాంకెట్స్ లేని దయనీయ స్థితిలో రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తెచ్చుకున్న ఆహారం అయిపోతే ఆకలితో చావడం తప్ప వేరే గత్యంతరం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: రష్యా చర్యలపై ఐరాసా భద్రతా మండలిలో ఓటింగ్.. భారత్ దూరం..
తమ క్షేమ సమాచారాన్ని కన్న వాళ్లకు అందించేందుకు సెల్ ఫోన్ల చార్జింగ్ కోసం, కనీస అవసరాలు తీర్చుకోవడానికి ప్రాణాలకు తెగించి బంకర్ల నుంచి బయటకు వచ్చి సమీపంలోని హోటళ్లకు పరుగులు తీస్తున్నారు. ఖార్కీవ్ నేషనల్ మెడికల్ వర్సిటీలో చదువుతున్న తెలుగు విద్యార్థులు శుక్రవారం ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. ఖార్కీవ్‌లో సుమారు 50 మెట్రో స్టేషన్లు ఉంటే ఒక్కో స్టేషన్‌లో సుమారు 600 మంది (అన్ని దేశాల వాళ్లు) తలదాచుకుంటున్నట్టు తెలిపారు. బంకర్లు మొత్తం నిండిపోయాయని వాపోయారు. ధ్వంసమైన భవనాలు.. రోడ్లపై మిసైళ్ల దాడుల నడుమ భయంతో సాయం కోసం ఎదురు చూస్తున్నామని వాపోయారు.
గూగుల్ ఫామ్స్‌లో తమ సమాచారం పంపినా ఇప్పటివరకు ఇండియన్ ఎంబసీ నుంచి ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. కాల్ సెంటర్లకు ఫోన్ చేసినప్పటికీ నెట్‌వర్క్ సమస్యతో పాటు బిజీ వస్తోందని చెప్పారు. రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయిందని, ఎంబసీ అధికారులు మాత్రం బోర్డర్ వరకు వస్తే ఇండియాకి చేరుస్తామని చెబుతున్నారని.. అడుగు బయట పెట్టలేని స్థితిలో బోర్డర్‌కు ఎలా చేరుకోగలమని వాపోతున్నారు. స్థానిక పరిస్థితులను బయట వారికి చేరవేయకూడదంటూ నిత్యం అనౌన్స్‌మెంట్లు ఇస్తున్నారని, బయటకు ఎప్పుడు తీసుకెళ్తారో చెప్పకుండా సేఫ్టీ మెజర్స్ పాటించండి అంటూ సూచనలు చేస్తున్నారన్నారు. ఖార్కీవ్ నగరంలో తణుకు, అమలాపురం, కాకినాడ, ఖమ్మం, హైదరాబాద్, గుంటూరు, రాజమండ్రి, విజయవాడకు చెందిన విద్యార్థులు ఉన్నట్టు తెలిపారు.
అమ్మా.. కంగారు పడొద్దు!
నేను ఖార్కీవ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాను. ప్రస్తుతం మేం బంకర్లలో సేఫ్‌గా ఉన్నాం. శుక్రవారం చాలాసేపు బాంబులు పేలాయి. ఉష్ణోగ్రత పడిపోయింది. మేం ఇండియాకి వెళ్లిపోతామంటే వర్సిటీ వాళ్లు అకడమిక్స్ పోతాయని భయపెట్టేశారు. ఇక్కడి విషయాలను ఎవ్వరికీ చెప్పొద్దని అనౌన్స్‌మెంట్ ఇస్తున్నారు. వీడియోలు.. ఫొటోలు తీయకుండా అడ్డుకుంటున్నారు. అమ్మా.. నాన్నా మీరు కంగారుపడొద్దు. త్వరలోనే పరిస్థితి నార్మల్ అవుతుందని చెబుతున్నారు.
– తమలం అభిజ్ఞ, తణుకు, పశ్చిమ గోదావరి
Comments
Please login to add a commentAdd a comment