లండన్: రాణి ఎలిజబెత్-2 మృతదేహం లండన్ వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో ఉంది. సోమవారం(19న) ఉదయం 6.30 గంటల వరకు ఉంటుందని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఉదయం 11 గంటలకు రాణి అధికారిక అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమవుతుందని బకింగ్‌హమ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ దేశాల అధినేతలు, ప్రధానులు, ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై ఘన నివాళి అర్పించనున్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్, టర్కీ ఎర్డోగన్, బ్రెజిల్ జైర్ బోల్సోనారో, బ్రెగ్జిట్ పరిణామంతో సంబంధం లేకుండా యూరోపియన్ యూనియన్, యూరోపియన్ మండలి ప్రతినిధులకు సైతం ఆహ్వానం పంపింది రాజప్రసాదం. వీళ్లతో పాటు 56 దేశాల కామన్‌వెల్త్ దేశాల ప్రతినిధులు సైతం హాజరు కానున్నారు. అయితే..
రాణి అంత్యక్రియలకు అధికారిక ఆహ్వానం అందనిది ఎవరికో తెలుసా?.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు. అవును.. ఉక్రెయిన్‌పై దురాక్రమణ నేపథ్యంలో ఆయనపై యూకే కూడా ఆంక్షలు, ట్రావెల్ బ్యాన్ విధించింది. అందుకే ఆయనకు క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు ఆహ్వానం అందించలేదు. అయితే రష్యా నుంచి ఏ ప్రతినిధిని ఆహ్వానించకపోవడంపై ఆ దేశ విదేశాంగ శాఖ నొచ్చుకుంది. ఈ చర్య అనైతికమంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇక సిరియా, వెనిజులా, తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గనిస్తాన్‌కు అసలు ఆహ్వానం పంపలేదు. బెలారస్, మిలిటరీ పాలనలో ఉన్న మయన్మార్‌కు ఆహ్వానం పంపించలేదు యూకే. అలాగే కొన్ని చిన్నచిన్న దేశాలనూ కూడా మినహాయించింది. నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ పాలనలోని ఉత్తరకొరియా, నికారాగువా, ఇరాన్‌ల నుంచి దౌత్యవేత్త స్థాయి వాళ్లకు మాత్రమే ఆహ్వానం ఉంటుందని స్పష్టం చేసింది.
భర్త సమాధి పక్కనే..
ఇక సోమవారం జరగబోయే అంత్యక్రియల కార్యక్రమం.. బ్రిటన్ వ్యాప్తంగా రెండు నిమిషాలు మౌనం పాటించడంతో ముగుస్తుంది. అనంతరం రాణి పార్ధివ దేహం ఉంచిన శవపేటికను వెస్ట్‌మినిస్టర్ అబేకు తరలిస్తారు. ఉదయం 8 గంటలకు వెస్ట్‌మినిస్టర్ అబే తలుపులు తెరుస్తారు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా వివిధ దేశాధినేతలు, ప్రతినిధులు 500 మంది హాజరవుతారు. రాణి శవపేటికను వెస్ట్ మినిస్టర్ అబే నుంచి విండ్సర్ క్యాజిల్ సమీపంలోని సెయింట్ జార్జ్ చాపెల్ వద్ద జరిగే కార్యక్రమం కోసం తరలిస్తారు. ఇక్కడ సాయంత్రం 4 గంటలకు రాయల్ వాల్ట్‌లోకి శవపేటికను దించుతారు. ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటెర్‌బరీ జస్టిన్ ఆశీర్వచనాల మధ్య అక్కడ చేరిన వారంతా ‘గాడ్ సేవ్ ది కింగ్’గీతాన్ని ఆలపిస్తారు. రాత్రి 7.30 గంటలకు జరిగే కార్యక్రమంలో భర్త ఫిలిప్ సమాధి పక్కనే రాణి పార్థివ దేహాన్ని ఖననం చేస్తారు.
ఇదీ చదవండి: చావు నుంచి మళ్లీ పుట్టుక వైపు!
Comments
Please login to add a commentAdd a comment