న్యూఢిల్లీ: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను వశం చేసుకోగానే అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ దేశం విడిచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు పారిపోయారు. మానవతా దృక్పథంతో తాము ఘనీకి ఆశ్రయం ఇచ్చినట్లు యూఏఈ ప్రకటించింది కూడా. నిజానికి ఆ దేశం కేవలం ఘనీ ఒక్కరికే కాదు.. ఆయనలా శరణార్థులుగా వచ్చిన ఎంతో మంది దేశాధినేతలకు, ప్రముఖులకు ఆశ్రయం ఇచ్చింది. ఎందుకు వీళ్లంతా యూఏఈనే తమకు సురక్షిత స్థావరమని భావించారు? ఆ దేశం సైతం వారి రాకను స్వాగతించడం వెనుక కారణాలేంటి?!
ఎందుకు యూఏఈకే?
గల్ఫ్ దేశమైన యూఏఈకి అమెరికాతో సత్సంబంధాలే ఉన్నాయి. ముఖ్యంగా భద్రతాపరమైన విషయాల్లో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంది. అగ్రరాజ్యంతో మెరుగైన ద్వైపాక్షిక బంధాలు ఉండటం యూఏఈకి కలిసి వచ్చే అంశం. కాబట్టి, అక్కడికి వెళ్తే సురక్షితంగా ఉండవచ్చని అమెరికాతో వైరం లేని పెద్దలు భావించడం సహజం. అంతేకాదు, పెద్ద సంఖ్యలో చమురు నిల్వలు కలిగి ఉన్న ఈ గల్ఫ్ దేశంలో అండర్‌గ్రౌండ్ స్థావరాలు కూడా ఎక్కువే ఉంటాయి. ఎయిర్‌పోర్టుల్లో కూడా ఐరిస్ స్కానింగ్, భారీ సంఖ్యలో సెక్యూరిటీ కెమెరాలు, 24 గంటల పర్యవేక్షణ వంటి అంశాలు కూడా పారిపోయి వచ్చిన ఒకప్పటి దేశాధినేతలను ఆకర్షించే అంశాలు.
ఇక యూఈఏలో విలాసాలకు కొదువ లేదు. అత్యాధునిక ఫైవ్‌స్టార్ హోటళ్లు, సకల సౌకర్యాలతో కూడిన భవనాలు, ఇతర వినోదాలు పంచే ప్రదేశాలు కోకొల్లలు. దేశం విడిచి వచ్చే సమయంలో తెచ్చుకున్న సొమ్మును ఖర్చు చేసేందుకు, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేందుకు ఇక్కడ అనువైన పరిస్థితులు ఉంటాయని విశ్లేషకుల అభిప్రాయం. తద్వారా ఇటు ఆశ్రయం కల్పించిన యూఏఈకి, అటు శరణుజొచ్చి వచ్చిన వారికి.. ఉభయులకు లాభదాయకమే.
యూఏఈకి కలిగే ప్రయోజనమేమిటి?
అజ్ఞాతంలో ఉన్న నేతల దశ తిరిగి ఒకవేళ మళ్లీ అధికారం చేపట్టినట్లయితే.. రాజకీయంగా, దౌత్యపరంగా సత్పంబంధాలు కొనసాగే అవకాశం ఉంటుంది. సంక్షోభ సమయంలో ప్రముఖులను ఆదుకోవడం, వారికి భద్రత కల్పించడం ద్వారా తాము నమ్మకమైన భాగస్వామినని నిరూపించుకుంటూ.. తదనంతర ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.
ఈ విషయాల గురించి క్రైసిస్ గ్రుపునకు చెందిన మిడ్‌ఈస్ట్ అడ్వైజర్ దీనా ఎస్ఫాన్‌డియరీ ఏపీతో మాట్లాడుతూ.. ‘‘సంక్షోభంలో ఉన్న వారిని ఆదుకునే క్రమంలో ఏ దేశమైనా సరే తనను తాను గొప్ప ఉదారవాదిగా చిత్రీకరించుకోవడం సహజం. ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి. ఎవరూ ఇందుకు అతీతం కాదు’’ అని వ్యాఖ్యానించారు. మిత్రదేశమైన అమెరికా సైనిక విన్యాసాలకు, ప్రయాణాలకు అనువైన పరిస్థితులు కల్పించే యూఏఈ.. తాను రిలయబుల్ పార్ట్‌నర్ అని నిరూపించుకునే క్రమంలో కూడా ఘనీకి ఆశ్రయం ఇచ్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
ఘనీకి ముందు వీళ్లు సైతం..
గత కొన్నేళ్లుగా యూఏఈలో అజ్ఞాతవాసం చేస్తున్న మాజీ దేశాధినేతల జాబితాలో ఇప్పుడు అశ్రఫ్ ఘనీ కూడా చేరారు. ఆయన కంటే ముందు.. తోబుట్టువులైన థాయ్‌లాండ్ మాజీ ప్రధానులు థక్సిన్ శినావత్రా, యింగ్లక్ శినావత్రా యూఏఈలోనే ఆశ్రయం పొందుతున్నారు. పాకిస్తాన్ దివంగత ప్రధాని బేనజీర్ భుట్టో, పాక్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషారఫ్ కూడా ఒకప్పుడు దుబాయ్‌లో తలదాచుకున్న వారే.
స్పానిష్ రాజు జువాన్ కార్లోస్(అవినీతి ఆరోపణలు), యెమెన్ నాయకుడి పెద్ద కుమారుడు అహ్మద్ అలీ అబ్దుల్లా సలేహ్ వంటి వారు కూడా ఈ లిస్టులో ఉన్నారు. కాగా అవినీతి ఆరోపణల నేపథ్యంలో థాయ్ మాజీ ప్రధాని థక్సిన్ శినావత్రా జైలు శిక్ష తప్పించుకునేందుకు యూఈఏ పారిపోగా.. ఆయన సోదరి యింగ్లక్ శినావత్రా సైనిక తిరుగబాటు నేపథ్యంలో 2018, జనవరిలో అక్కడికే వెళ్లారు.
చదవండి: Kabul Airport: మరో 3 రోజులే.. రోడ్లన్నీ బ్లాక్ చేస్తున్న తాలిబన్లు!
Comments
Please login to add a commentAdd a comment