సుయెల్లా బ్రేవర్మన్, జేమ్స్ క్లెవర్లీ
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సోమవారం తన మంత్రివర్గంలో ఆకస్మిక మార్పుచేర్పులు చేశారు. కొంతకాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత మూలాలున్న హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ముందుగా నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే మాజీ ప్రధాని డేవిడ్ కామెరాన్‌ను విదేశాంగ మంత్రిగా నియమిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటిదాకా విదేశాంగ మంత్రిగా ఉన్న జేమ్స్ క్లెవర్లీని బ్రేవర్మన్ స్థానంలో హోం మంత్రిగా నియమించారు.
ప్రధాని సిఫార్సుల మేరకు వారిద్దరి నియామకాలకు రాజు చార్లెస్ ఆమోదముద్ర వేసినట్టు డౌనింగ్ స్ట్రీట్ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు హౌజింగ్ మంత్రి రేచల్ మెక్లీన్‌ను కూడా సునాక్ పదవి నుంచి తప్పించారు.ఈ నేపథ్యంలో మరో ఆరుగురు జూనియర్ మంత్రులు కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు! థెరెసా కోఫీ, నిక్ గిబ్, నీల్ ఓబ్రియాన్, విల్ క్విన్స్, జెస్సీ నార్మన్ ఈ జాబితాలో ఉన్నారు.
కామెరాన్... అనూహ్య ఎంపిక
57 ఏళ్ల కామెరాన్‌కు రిషి విదేశాంగ బాధ్యతలు అప్పగించడం అనూహ్యమేనని చెప్పాలి. ఒక మాజీ ప్రధానిని ఇలా మంత్రివర్గంలోకి తీసుకోవడం బ్రిటన్‌లో చాలా అరుదు. పైగా ప్రధానిగా రాజీనామా చేశాక కామెరాన్ ఏడేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అంతేగాక ప్రస్తుతం ఎంపీ కూడా కాదు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లోకి తీసుకున్నారు. బ్రిటన్లో ఇలా విదేశాంగ మంత్రి ఎగువ సభ్య సభ్యుడిగా ఉండటం 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
1980ల్లో లార్డ్స్ సభ్యుడైన పీటర్ కారింగ్టన్ మార్గరెట్ థాచర్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పని చేశారు. కష్టకాలంలో ప్రధానిగా రిషి పనితీరు గొప్పగా ఉందంటూ కామెరాన్ ఈ సందర్భంగా మెచ్చుకున్నారు. ‘‘కొన్ని వ్యక్తిగత నిర్ణయాల విషయంలో రిషితో నేను గతంలో విభేదించ ఉండొచ్చు. కానీ ఆయన అత్యంత సమర్థుడైన ప్రధాని’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దేశ భద్రత, ప్రగతి తదితర కీలకాంశాల్లో ఆశించిన ఫలితాల సాధనలో రిషికి శక్తివంచన లేకుండా తోడ్పడతా.
ఏడేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నా కీలక సవాళ్లను దీటుగా ఎదుర్కోవడంలో రిషికి దన్నుగా నిలిచేందుకు నా రాజకీయ అనుభవమంతటినీ రంగరిస్తా’’ అని చెప్పారు. 2010 నుంచి 2016 దాకా ఆరేళ్లపాటు ఆయన బ్రిటన్ ప్రధానిగా ఉన్నారు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో కొనసాగాలని గట్టిగా వాదించారు. ఈ విషయమై 2016లో మూడు రెఫరెండాలు తెచ్చారు.
కానీ ప్రజలు ఈయూ నుంచి వైదొలగేందుకు (బ్రెగ్జిట్)కే ఓటేయడంతో రాజీనామా చేశారు. సునాక్ కూడా బ్రెగ్జిట్‌కే మద్దతిచ్చారు. పైగా ఆ సమయంలో కామెరాన్ మంత్రివర్గంలో సునాక్ జూనియర్ మంత్రి కూడా కావడం విశేషం! విదేశాంగ మంత్రి జై శంకర్ ఐదు రోజుల పర్యటన నిమిత్తం ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్నారు. ఆదివారం సునాక్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు కూడా. పర్యటనలో భాగంగా క్లెవర్లీతో జై శంకర్ సమావేశాలు జరపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా విదేశాంగ బాధ్యతలు స్వీకరించిన కామెరాన్‌తో జై శంకర్ చర్చలు ఎలా జరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
బ్రేవర్మన్.. రెండోసారి ఉద్వాసన
ఇక రిషి మంత్రివర్గంలో సీనియర్ సభ్యురాలైన 43 ఏళ్ల బ్రేవర్మన్ హోం శాఖ మంత్రిగా తప్పుకోవాల్సి రావడం ఇది రెండోసారి! ఈసారి ఆమెపై వేటు ఒకవిధంగా ఊహిస్తున్నదే. గోవా మూలాలున్న ఆమె రెచ్చగొట్టే మాటలు, వివాదాస్పద వ్యాఖ్యలతో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ఇటీవల లండన్‌లో జరిగిన పాలస్తీనా మద్దతుదారుల ర్యాలీని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శిస్తూ ద టైమ్స్ పత్రికలో బ్రేవర్మన్ రాసిన వ్యాసంపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తాయి.
హోం మంత్రిగా ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సహించరానిదంటూ విపక్షాలతో పాటు అధికార కన్సర్వేటివ్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మండిపడ్డారు. వ్యాసంలోని సదరు విమర్శలను తొలగించాలని ప్రధాని కార్యాలయం ఆదేశించినా ఆమె బేఖాతరు చేసినట్టు తేలింది. ఈ నేపథ్యంలో బ్రేవర్మన్‌ను తప్పించడం ఖాయమని అంతా భావించారు. అంతకుముందు లిజ్ ట్రస్ మంత్రివర్గం నుంచి కూడా ఆమె రాజీనామా చేయడం విశేషం. అప్పుడు కూడా మంత్రిగా పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు.
పలు కీలకాంశాలపై ట్రస్ సర్కారు అయోమయంలో ఉందని ఆమె బాహాటంగా విమర్శించడం సంచలనం సృష్టించింది. వలసదారులపై ఆమె వ్యాఖ్యలూ దుమారమే రేపాయి. తర్వాత వలసలకు సంబంధించి అధికార పత్రాలను నిబంధనలకు విరుద్ధంగా సహచర పార్టీ ఎంపీకి చూపించిన అంశంలో రాజీనామా చేయాల్సి వచి్చంది. ట్రస్ స్థానంలో రిషి ప్రధాని అయ్యాక బ్రేవర్మన్‌ను అనూహ్యంగా మంత్రివర్గంలోకి తీసుకోవడమే గాక మళ్లీ కీలకమైన హోం శాఖ బాధ్యతలే అప్పగించారు.
దీనిపై అప్పట్లోనే ఆశ్చర్యం వ్యక్తమైంది. తాజా వేటు నేపథ్యంలో సునాక్‌కు ఆమె కంట్లో నలుసుగా మారడం ఖాయమంటున్నారు. కన్సర్వేటివ్ పారీ్టలోని తన మద్దతుదారుల దన్నుతో ప్రభుత్వానికి సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజీనామా అనంతరం విడుదల చేసిన సంక్షిప్త ప్రకటనలో ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా దీన్ని బలపరిచేలానే ఉన్నాయి. ‘‘ఇంతకాలం హోం మంత్రిగా పని చేయడం నాకు గొప్ప గౌరవం. సమయం వచి్చనప్పుడు చాలా సంగతులు చెప్తా’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు!
వివాదాస్పద వ్యాఖ్యలు
► బ్రిటన్లో వీసా కాల పరిమితి ముగిసినా దేశం వీడని వారిలో అత్యధికులు భారతీయులేనన్న బ్రేవర్మన్ వ్యాఖ్యలు దుమారం రేపాయి.
► భారత్‌తో ఓపెన్ మైగ్రేషన్ విధానాన్నీ ఆమె తప్పుబట్టారు.
► మరో సందర్భంలో బ్రిట న్లోని అక్రమ వలసదారులను ఆఫ్రికాలోని రువాండాకు తరలిస్తానన్నారు.
► బ్రిటన్లో ఎక్కడ పడితే అక్కడ వీధుల్లోనే నివసిస్తున్న వారు చాలావరకు అక్రమ వలసదారులేనన్నారు.
► శరణార్థుల తాకిడిని వలసదారుల దండయాత్రగా అభివరి్ణంచారు.
► అతి వేగంగా కారు నడిపిన కేసులో జరిమానా, ఫైన్ పడ్డ విషయాన్ని దాచేందుకు ప్రయతి్నంచారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment