ఉక్రెయిన్ సంక్షోభంలో పెద్దన్న పాత్ర పోషించాలని ప్రయత్నిస్తున్న చైనాకు వరుస షాకులు తగులుతున్నాయి. రష్యాకు ఉక్రెయిన్ దురాక్రమణలో సహకరిస్తే.. తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని అమెరికా సహా పాశ్చాత్య దేశాలు చైనాను హెచ్చరిస్తూ వస్తున్నాయి. అయినా రష్యాకు పరోక్ష సాయం అందిస్తూనే.. శాంతి సందేశం వినిపిస్తోంది డ్రాగన్ కంట్రీ.
ఈ క్రమంలో రష్యా తాజా ప్రకటన.. చైనాను మరింత ఇరకాటంలోకి నెట్టేదిగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా, చైనాల మధ్య బంధం మరింత బలపడుతుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అంటున్నారు. ‘‘అంతర్జాతీయ వ్యవస్థ ఆధారపడి ఉన్న పునాదులను అన్ని పాశ్చాత దేశాలు అణగదొక్కుతున్నాయి. కానీ, చైనా, రష్యాలు మాత్రం గొప్ప శక్తులుగా ముందుకు ఎలా వెళ్లాలి అనే కోణంలోనే ఆలోచిస్తున్నాయి. ఈ సమయంలోనూ చైనా సహకారం మాకు అందడం ఆనందాన్ని ఇస్తోంది. ఇరు దేశాల మధ్య సహకారం మరింత బలపడుతుందని ఆశిస్తున్నా’’ అంటూ వ్యాఖ్యానించారు ఆయన.
యూటర్న్ తర్వాతే..
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తాజాగా బీజింగ్(చైనా రాజధాని) పర్యటనకు బయలుదేరారు. గురువారం ఆయన ప్రయాణించిన విమానం.. మార్గం మధ్యలోనే యూటర్న్ తీసుకుంది. సెర్బియా నోవోసిబిర్‌స్క్ నుంచి మాస్కోకు తిరుగుటపా కట్టింది. అనూహ్యమైన ఈ పరిణామాలపై జోరుగా చర్చలు నడిచాయి. అమెరికా వార్నింగ్ నేపథ్యంలో పుతిన్.. సెర్గీని వెనక్కి రప్పించుకున్నాడని.. కాదుకాదు చైనానే ఆయన్ని పర్యటన రద్దు చేసుకోమని ఒత్తిడి చేసిందని.. ఇలా కథనాలు మొదలయ్యాయి. విశేషం ఏంటంటే.. ఇప్పటిదాకా ఆయన పర్యటన రద్దుపై రష్యా సైతం ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయిన కొన్ని గంటలకే రష్యా నుంచి ఇలాంటి ప్రకటన వెలువడడం గమనార్హం. సెర్గీ ప్రకటనపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఉక్రెయిన్ యుద్ధం ఎవరూ కోరుకోని సంక్షోభం అని జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వద్ద ప్రస్తావించిన విషయం తెలిసిందే. సుమారు రెండు గంటలపాటు వీడియో కాన్ఫరెన్స్‌లో శుక్రవారం వాళ్లిద్దరి మధ్య సంభాషణ సాగింది. ప్రపంచమంతటా శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఇందుకోసం ఉమ్మడిగా సహకారం అందిద్దామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సూచించారు. రష్యాకు సహకారం అందిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు బైడెన్ నేరుగా హెచ్చరించిన తర్వాతే.. జిన్‌పింగ్ భేటీ కావడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment