ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు సాధారణ పౌరులపై సాగించిన ఊచకోత.. ఊహించినదానికంటే ఎక్కువే ఉందని తెలుస్తోంది. ఈ మేరకు కేవలం బుచాలోనే 300 మందికిపైగా పౌరులు బలయ్యారంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపిస్తున్నారు. అయితే బోరోడ్యాంకా, ఇతర పట్టణాల్లో ఆ సంఖ్యే లెక్కకు అందనంత ఉండొచ్చని అంచనా వేస్తోంది ఉక్రెయిన్.
మానవతాధృక్పథంతో.. ఉక్రెయిన్‌లోని కొన్ని నగరాలు, పట్టణాల నుంచి బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అప్పటికే అక్కడ దారుణాలకు తెగబడిన విషయం ఇప్పుడు వెలుగు చూస్తోంది. రోడ్ల వెంబడి చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉండగా.. రష్యా సైన్యం అకృత్యాలకు సైతం పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన పట్టణాల్లో ఇలా పౌరులను కిరాతకంగా బలిగొన్న ఉదంతాలు.. వీడియో ఆధారాలతో సహా ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
ఉక్రెయిన్ తో పాటు పాశ్చాత్య దేశాల కూటమి ఈ దమనకాండను ఖండిస్తున్నాయి. రష్యాపై మరింత ఆంక్షలు విధించడంతో పాటు యుద్ధ నేరాలకు పాల్పడిన కారణంగా దర్యాప్తునకు ఆదేశించాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. మరోవైపు ఐక్యరాజ్య సమితి సైతం ఈ మారణహోమంపై తీవ్రస్థాయిలో స్పందించింది. ఆధునిక కాలంలో ఇలాంటి ఘోరాలను చూడలేదని పేర్కొంటూ.. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది కూడా. అయితే రష్యా మాత్రం తాము ఎలాంటి అఘాయిత్యాలకు, అకృత్యాలకు పాల్పడలేదని చెబుతోంది.
ఇదిలా ఉండగా.. రష్యా మారణహోమంపై మంగళవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రసంగించనున్నాడు. సాధారణ పౌరులను బలిగొన్న ఘటనలకుగానూ రష్యాపై బహిరంగ దర్యాప్తును కోరుతూ ఆయన ప్రపంచ దేశాలపై ఒత్తిడి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నరమేధంపై దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని ఇప్పటికే ఆయన విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment