
మీకు స్నాక్స్‌లో అన్నింటికన్నా పాస్తా ఎక్కువ ఫేవరెటా? దాన్ని తినకుండా ఉండటం మీ వల్ల కాదా? అయితే మీకు ఓ హెచ్చరిక లాంటి విజ్ఞప్తి. పాస్తాతో రెడీ చేసిన ఓ కొత్త వంటకం నెట్టింట చక్కర్లు కొడుతూ ఆహార ప్రియుల కడుపు మీద కొడుతోంది. దాన్ని చూసిన మరుక్షణం కొందరు కళ్లు మూసుకుంటుంటే మరికొందరు అది కూడా వంటకమే అన్న విషయాన్ని జీర్ణించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ అందరూ చూపు తిప్పేసుకుంటున్న అంతటి ఘోర పాకం ఏంటి? ఎలా చేశారో? చదివేయండి.. (చదవండి: గొప్ప అదృష్టం: చెత్త కుప్పనుంచి మంత్రి ఆఫీసుకు..)
జస్టిన్ ఫ్లామ్ అనే అమెరికన్ మెజీషియన్ ఓ గిన్నె తీసుకుని అందులో ఎనర్జీ డ్రింక్ పోశాడు. అది వేడెక్కిన తర్వాత పాస్తాను గుమ్మరించాడు. కాసేపు ఆ మిశ్రమాన్ని కలిపిన తర్వాత ప్లేటులోకి తీసుకున్నాడు. తర్వాత మరో గిన్నె స్టౌ మీద పెట్టి అందులో పిండి, నీళ్లు పోసి సాస్‌లా దగ్గరపడేవరకు కలుపుతూనే ఉన్నాడు. అది కాస్త చిక్కబడగానే దాన్ని ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తామీద అప్లై చేశాడు. 'ఇది చూసిన తర్వాత పాస్తాను మీరు ఎప్పటిలాగే రెడీ చేసుకుని తినలేరు' అన్న క్యాప్షన్‌తో షేర్ చేశాడు. చూస్తుంటేనే ఒళ్లు జలదరిస్తున్న ఈ రెసిపీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఇది చూసిన జనాలు ఆ వంటకాన్ని చీదరించుకోవడమో, దాన్ని తయారు చేసినవాడికి చీవాట్లు పెట్టకుండానో ఉండలేకపోతున్నారు. "ఎందుకురా ఇలాంటివి చేసి జీవితంలో వాటిని తినకుండా చేస్తారు?", "పాస్తాను సర్వనాశనం చేశారు" అంటూ పాస్తా ప్రియులు ఆవేదన చెందుతున్నారు. "ఛీ, దీన్ని చూడటం వల్ల నా టైమ్ వేస్ట్ అయింది" అంటూ మరికొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ఆల్రెడీ పెళ్లైన ప్రేయసి ఇంటికి సొరంగం)