ఎవరైనా మీకు ఉచితంగా వసతి సదుపాయం కల్పిస్తూ, వ్యాపారం చేసుకునేందుకు భారీ మొత్తంలో సొమ్ము ఇస్తామంటే కాదంటారా? నిజంగా ఇటువంటి అవకాశం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచిస్తున్నారా? అవును మీరు విన్నది నిజమే. అటువంటి అద్భుత అవకాశం ఇప్పుడు మీ ముందు ఉంది.
ఐర్లాండ్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు సుదూరతీరంలో ఉన్న ఐలాండ్‌లలో నివసించేందుకు అద్భుత అవకాశం కల్పిస్తోంది. అక్కడి నివసించేందుకు ఆసక్తి చూపేవారికి భారీ మొత్తంలో సొమ్ము అందిస్తోంది. జూలై 1 నుంచి జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలను వీడి రిమోట్ ఐలాండ్‌లో ఉండాలనుకునేవారికి రూ. 70 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
రద్దీ ప్రాంతాలను వీడి గ్రామీణ ప్రాంతాలలో నివాసం ఉండాలనుకునేవారికి ఇది నిజంగా బంపర్ ఆఫర్. ఐర్లాండ్ ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఫథకానికి ఐర్లాండ్ ప్రభుత్వం ‘అవర్ లివింగ్ ఐలాండ్ పాలసీ’ అని పేరు పెట్టింది.
మెట్రో యూకే రిపోర్టును అనుసరించి ఇప్పటి వరకూ మొత్తం 23 ఐలాండ్‌లను ఇందుకోసం సెలెక్ట్ చేశారు. ఆయా ఐలాండ్‌లలో ఉండేందుకు జనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఐలాండ్‌లు రద్దీ ప్రాంతాలకు దూరంగా కొండలు, నదులు, అడవుల మధ్య ఉన్నాయి. ఇక్కడ ఉండేవారి కోసం ప్రభుత్వం ఇళ్లు, భూములు ఇవ్వడంతోపాటు వ్యవసాయం లేదా వ్యాపారం చేసుకునేందుకు లక్షల రూపాయలు అందజేస్తోంది.
ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటంటే..
నిజానికి గ్రామీణ ప్రాంతాల్లోని వారు వివిధ కారణాలతో పట్టణాలకు వలస వెళుతున్నారు. ఫలితంగా గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. అక్కడి ఇళ్లు, రోడ్లు వృథాగా మిగులుతున్నాయి. ఇటువంటి పరిస్థితులను నివారించేందుకు ప్రభుత్వం ఈ ఆఫర్ అందజేస్తోంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఐలాండ్‌లకు వెళ్లేందుకు సుముఖత చూపిస్తారని ప్రభుత్వం భావిస్తోంది.
అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునేవారు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. 1993కు ముందు నిర్మించిన ప్రాపర్టీ కొనుగోలు చేయాల్సివుంటుంది. ప్రభుత్వం అందించే సొమ్మును ఇంటి నిర్మాణం లేదా రెనోవేషన్ కోసం మాత్రమే వినియోగించాలి. ప్రతీ ఐలాండ్‌లో నివసించేందుకు ప్రత్యేక నిబంధనలున్నాయి. వాటిని అక్కడ ఉండాలనుకునేవారు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
కొన్ని ఐలాండ్‌లలో నివసించేందుకు విదేశీయులకు ఏమాత్రం అనుమతి లేదు. కాగా ఈ విధానం ప్రస్తుతం ఐర్లాండ్ ప్రభుత్వం మాత్రమే అమలు చేయడం లేదు. పలు అభివృద్ధి చెందిన దేశాలు ఇటువంటి అద్భుత ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ జాబితాలో స్పెయిన్, ఇటలీ, చిలీ, మారిషస్, గ్రీస్, క్రొయేషియా మొదలైన దేశాలున్నాయి. ఈ దేశాలు శివారు ప్రాంతాల్లో ఉండేందుకు ఇష్టపడేవారికి వ్యాపారం చేసుకునేందుకు ఆర్థిక మద్దతు అందిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: బంగారు నగరంలో చీకటి సామ్రాజ్యం..
Comments
Please login to add a commentAdd a comment