సాక్షి ప్రతినిధి, వరంగల్:
అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టే పనిలో నిమగ్నమయ్యారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. జనగామ జగడానికి, స్టేషన్ ఘన్‌పూర్‌లో మాటల యుద్ధానికి తెరదించేందుకు ప్రగతిభవన్‌ను వేదికగా చేశారు. పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్న నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు మంతనాలు జరిపారు. ఈ మేరకు కేటీఆర్.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో భేటీ అయి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. షేక్ హ్యాండ్ ఇప్పించి ఐక్యతను చాటిచెప్పారు. అటు జనగామ అభ్యర్థి ఎవరనే అంశంపై సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో మాత్ర మే భేటీ అయి సస్పెన్స్‌కు తెరదించే పనిలో నిమగ్నమయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ప్రగతి భవన్‌లోనే ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సీఎం కేసీఆర్‌ను కూడా కలిశారు. కాగా, ఆయన మాత్రం జనగామ ఎమ్మెల్యే టికెట్ వదులుకోవడానికి ససేమిరా అన్నట్లు సమాచారం.
నెల రోజులుగా రగులుతున్న వివాదం..
రాష్ట్రంలో 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జనగామ టికెట్ విషయంలో సస్పెన్షన్‌లో పెట్టారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కాదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. దీంతో స్టేషన్ ఘన్‌పూర్ మాటల యుద్ధానికి అడ్డాగా మారగ, జనగామ టికెట్ జగడం అగ్గి రగిల్చి పార్టీ మూడుముక్కలు అయ్యే పరిస్థితి ఏర్పడింది. జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కాదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి టికెట్ ఇస్తున్నారనే ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సైతం ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొని పల్లా గో బ్యాక్ అంటూ విమర్శలు చేశారు. పల్లా మాత్రం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో రహస్య భేటీలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టారు. పల్లా తీరును ముత్తిరెడ్డితోపాటు మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి.. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ ఆదేశంతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాస్త వెనక్కి తగ్గారు. అయితే ముంచుకొస్తున్న ఎన్నికల ముహూర్తంతో కేటీఆర్ నెల రోజుల వివాదానికి తెరదింపి నాయకుల మధ్య సయోధ్య కుదిర్చే పని పెట్టుకున్నారు.
ముందు విడివిడిగా.. తర్వాత కలిపి
శుక్రవారం ఉదయం ప్రగతిభవన్‌కు చేరుకున్న కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యతో కేటీఆర్ మొదట విడివిడిగా మాట్లాడి.. ఆ తర్వాత ఇద్దరిని కలిపి మాట్లాడినట్లు తెలిసింది. పార్టీకి ఉన్న సమాచారం, సర్వేల ప్రకారం కొన్నిచోట్ల మార్పులు అనివార్యమైందని, ఈ నేపథ్యంలో సీఎం నిర్ణయం తీసుకున్నారని.. అందరూ కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థులను గెలిపించాలని సూచించినట్లు తెలిసింది. పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, రాష్ట్రస్థాయిలో సముచిత స్థానం ఉంటుందని కేటీఆర్ ఎమ్మెల్యే రాజయ్యకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. భేటీ అనంతరం రాజయ్య, కడియం శ్రీహరిలు కేటీఆర్ సమక్షంలో చేయి చేయి కలిపి కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యే రాజయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీ గెలుపునకు కృషిచేస్తానని చెప్పారు. తనకు మద్దతు ప్రకటించడం పట్ల రాజయ్యకు కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలపడంతో స్టేషన్‌ఘన్‌పూర్ వివాదానికి తెరపడినట్లయ్యింది.
కీలక నిర్ణయాల ప్రకటన...
ప్రగతిభవన్‌లో చర్చల అనంతరం గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టే పనిలోపడిన కేటీఆర్ త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది. సోమవారం నాటికి జనగామకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఖరారు అయ్యే అవకాశం ఉందన్న మరో చర్చ కొందరు పార్టీ ముఖ్యనేతల్లో మొదలైంది. బీఆర్‌ఎస్ అధిష్టానం తీసుకునే నిర్ణయాల కు కట్టుబడి పనిచేసి అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన వారికి సముచిత స్థానం ఉంటుందన్న కేటీఆర్.. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాడికొండ రాజ య్యలకు ఆర్టీసీ చైర్మన్, రైతుబంధు సమితి చైర్మన్ పదవులను ఇవ్వనున్నట్లు కూడా చెప్పినట్లు ప్రచా రం ఉంది. మొత్తానికి ఘన్‌పూర్ నియోజకవర్గ విషయంలో కేటీఆర్ భేటీ సత్ఫలితాలు ఇవ్వగా.. జనగామ జగడానికి తెరదించే మరో ప్రయత్నం మొదలెట్టారన్న చర్చ కూడా జరుగుతోంది.
In the presence of Minister KTR today
— Naveena (@TheNaveena) September 22, 2023
-Thatikonda Rajaiah, Kadiyam Srihari Patch up
-BJP Bagh Amberpet corporator Padma Venkat Reddy duo join BRS
-YSRTP Yepuri Somanna to join BRS soon
-Nizamabad development works discussed at Pragathi Bhavan with Bajireddy Govardhan pic.twitter.com/iv0tyW98lR
Comments
Please login to add a commentAdd a comment