సాక్షిప్రతినిధి, వరంగల్: గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌కు జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలు తలనొప్పిగా మారాయి. ఉమ్మడి వరంగల్‌లో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు 11 చోట్ల అభ్యర్థులను ఖరారు చేశారు. జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తిరిగి టికెట్ ఆశిస్తుండగా.. ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు సైతం పోటీ పడుతుండటంతో జనగామ టికెట్ ప్రకటన విషయాన్ని కేసీఆర్ ఆపిఉంచారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యును తప్పించి ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు.
నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలను కలిసి న ఎమ్మెల్యే రాజయ్య టికెట్ రాలేదన్న బాధలో కన్నీటి పర్యంతమయ్యారు. అయితే తాను సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో ఆయన హామీలకు కట్టుబడి చేస్తానని ప్రకటించారు. ఇదిలాఉండగా.. అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్‌లో బుధవారం నిర్వహించిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే రాజయ్య గైర్హాజర్ కావడం మళ్లీ బీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చకు తెరలేపింది. కడియం శ్రీహరి సభకు హాజరు కావాలని సంప్రదింపులు జరిపేందుకు హనుమకొండలోని ఎమ్మెల్యే రాజయ్య ఇంటికి వెళ్లిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన లేకపోవడంతో వెనుతిరిగారు.
అనంతరం స్థానిక కార్యకర్తలు, రాజయ్య అనుచరులతో భేటీ అయిన పల్లా.. రాజయ్యకు బీఆర్‌ఎస్ అధిష్ఠానం సముచిత స్థానం కల్పిస్తుందని.. రెండు మూడు రోజుల్లోనే కేసీఆర్‌ను కలుస్తామని తెలిపినట్లు సమాచారం. కాగా స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో నిర్వహించిన భారీ సభకు ఎమ్మెల్యే రాజయ్య గైర్హాజరు కావడం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో చర్చకు దారితీసింది.
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోనూ వివాదం సద్దుమణగడం లేదు. ఆ స్థానంపై సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు పట్టు వీడటం లేదు. ఉమ్మడి వరంగల్‌లో 11 స్థానాలను ప్రకటించిన కేసీఆర్.. ఆ ఒక్క సీటుపై ఈ నెల 25న నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో టికెట్ ప్రయత్నాల్లో భాగంగా మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవితలను కలిసిన ముత్తిరెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు.
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో తిరగడంతో పాటు ఎమ్మెల్సీగా తాను జనగామ నియోజకవర్గానికి కేటాయించిన నిధులు, చేసిన పనులను వివరిస్తూ కేసీఆర్, కేటీఆర్‌ల ఆశీస్సులతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నానంటూ వీడియో విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామ నియోజకవర్గం ముఖ్యనేతలతో భేటీ అవుతూ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా అభ్యర్థులను ప్రకటించిన ఉమ్మడి వరంగల్‌లోని 10 స్థానాల్లో పరిస్థితి సర్దుకుపోగా.. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌లలో సద్దుమణగని వివాదాలు అధిష్టానంకు తలనొప్పిగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment