జనగామ: సీఎం కేసీఆర్‌ను బరాబర్ కలుస్తా.. జనగామ అభివృద్ధికి నిధులు తీసుకువస్తా.. స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలు, పార్టీ కేడర్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటానని బీఆర్‌ఎస్ జనగా మ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం పట్టణంలోని 1, 6, 10, 18 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అలాగే గ్రెయిన్ మార్కెట్, పూసల కులస్తులు, పార్టీ శ్రేణులతో సమావేశమై మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలువగానే జిల్లా కేంద్రం, చేర్యాలలో ఇంటి నిర్మాణం చేపట్టి ఇక్కడే ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పల్లా అన్నారు.
జనగామను సిద్దిపేట, గజ్వేల్‌కు దీటుగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ను మూడోసారి ఆదరించాలని, అధికారంలోకి రాగానే గ్యాస్ సిలిండర్ రూ.400కే అందజేస్తామని, ఆసరా పింఛన్ పెంచడంతోపాటు సంక్షేమ పథకాలు వందశాతం కొనసాగిస్తామన్నారు. ఆపత్కాలంలో ఎంతోమంది నిరుపేదలకు సీఎం సహాయ నిధి నుంచి కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించామని, వడ్లకొండకు చెందిన దయాకర్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా నీలిమ ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు.
రేవంత్‌లో అసహనం..
ప్రజల కోసం సీఎం వద్దకు వెళ్తే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి తప్పులా ఎందుకు అనిపించిందో అర్థం కావడం లేదు.. తన వద్దకు వచ్చిన వారిని రేపు.. మాపు అని తిప్పించుకునే అలవాటు లేదని అన్నా రు. జనగామ సభలో రేవంత్ ప్రసంగానికి జనం నుంచి రెస్పాన్స్ లేదు.. మాటిమాటికీ చీదరించుకోవడం ఆయన అసహనాన్ని మరోసారి గుర్తు చేసిందని అన్నారు. చేర్యాలలో జరిగే సీఎం కేసీఆర్ సభకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి మీటింగ్ ఎలా ఉంటుందో నిరూపించనున్నారని పేర్కొన్నారు.
పూసల కులస్తుల సమావేశంలో..
జిల్లా కేంద్రం పూసల భవనంలో కులస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. వృత్తి, చట్టపరంగా రావాల్సిన అన్ని పథకాలు అందేలా చూడడంతోపాటు సంఘానికి స్థలం ఉంటే కమ్యూనిటీ భవనం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు.. వారిని నమ్మి మోసపోవద్దని వార్డుల్లో ఇంటింటి ప్రచారంలో ప్రజలకు సూచించారు. బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి, సంక్షేం సాధ్యమని వివరించారు.
వ్యవసాయ మార్కెట్‌లో..
ఏఎంసీ చైర్మన్ బాల్దె సిద్ధిలింగంతో కలిసి జనగామ వ్యవసాయ మార్కెట్‌లో రైతులు, హమాలీలు, మిల్లర్లతో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. దేశంలో రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చే ఏకై క సీఎం కేసీఆర్ అని అన్నారు. హమాలీలు, దడువాయి, స్వీపర్లకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ రావాల్సిన అవస రం ఉందని చెప్పారు. అన్నపూర్ణ పథకం ద్వారా మార్కెట్‌లో రూ.5కే భోజన సౌకర్యం కల్పిస్తామని, అత్యాధునిక టెక్నాలజీతో కోల్డ్ స్టోరేజీ, గోదాంల నిర్మాణం చేపడతామన్నారు. వ్యవసాయ ఖర్చులు పెరగడంతో రైతుబంధు సాయం రూ.16 వేలకు పెంచాలని కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. వికాస్‌నగర్‌లోని పల్లా నివాసంలో పలు పార్టీల నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు.
‘పల్లా’ అంటే ఓ నమ్మకం.. భరోసా!
పల్లా రాజేశ్వర్‌రెడ్డి అంటేనే ఓ నమ్మకం, పేదలకు భరోసా అని ఆయన సతీమణి నీలిమ అన్నారు. జనగామ మండలం పెంబర్తిలో ఆమె ఇంటింటి ప్రచారం చేపట్టగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ జనగామ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగుర వేసేందుకు ప్రజలు, పార్టీ శ్రేణులు కంకణబద్ధులై ఉన్నారని చెప్పారు. గ్రామంలో మిగిలి పోయిన అభివృద్ధి పనులను రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందగానే పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు.
రాజేశ్వర్‌రెడ్డి గెలుపే లక్ష్యం..
బీఆర్‌ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు మేక సంతోష్‌కుమార్, మంద యాదగిరి పిలుపునిచ్చారు. గురువారం మండల పరిధి పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం హనుమతండా పంచాయతీ నాలుగో వార్డు సభ్యురాలు కళావతి శంకర్ బీఆర్‌ఎస్‌లో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు.
కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్లిపెద్ది సుమలత మల్లేశం, మండల ఉపాధ్యక్షుడు మంద సుమన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఆరీఫ్, మండల ఇన్‌చార్జ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే కొమురవెల్లి మండలం రసులాబాద్‌లో సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి, గ్రామశాఖ అధ్యక్షుడు కనుకయ్య ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
చిన్నరామన్‌చర్లలో ఇంటింటి ప్రచారం..
బచ్చన్నపేట మండలం చిన్నరామన్‌చర్ల గ్రామంలో జాగృతి మండల మాజీ అధ్యక్షురాలు పిన్నింటి కావ్యశ్రీరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ మద్దికుంట రాధ, మాజీ సర్పంచ్ కంసా ని మమత, ఎంపీటీసీ మామిడి అరుణ, నాయకులు అయిలయ్య, బాలకృష్ణ, శ్రీను, వెంకటేష్, నర్సింగ్, స్వరూప, తార, రాజమణి, విజయ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment