జనగామ: ఎండుతున్న పంటలకు సాగునీరు అందించి ఆదుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి ఫలితంగానే దేవాదుల థర్డ్ ఫేజ్ బటన్‌ను ఆన్ చేయనున్నట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి ఆయన మాట్లాడుతూ దేవన్నపేట నుంచి ధర్మసాగర్‌కు వచ్చే థర్డ్ ఫేజ్‌ను ఈ నెల 19న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆన్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా తపాస్‌పల్లి, గండిరామారం, బొమ్మకూరు, కన్నెబోయినగూడెం, వెల్దండ, లద్నూర్ రిజర్వాయర్లను నింపి జనగామ నియోజకవర్గంలోని ఆయకట్టు ప్రాంతానికి సాగునీరు ఇవ్వాల్సిన ప్రభుత్వం, పంట కోత దశకు వచ్చి ఎండుతున్నా.. పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజన్‌లో 60 రోజుల్లో కేవలం 40 రోజులు మాత్రమే పంపులను నడిపించడం బాధాకరమన్నారు. జనగామ నియోజకవర్గంలోని దేవాదుల ఆయకట్టు పరిధిలో 50 శాతం మేర పంట పూర్తిగా ఎండిపోయిందన్నారు. పంటల పరిస్థితిపై రైతులు ప్రతిరోజు తన దృష్టికి తీసుకువచ్చారని, ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు జిల్లా ఇరిగేషన్ అధికారుల నుంచి ఉన్నతాధికారులు, మంత్రి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు. అసెంబ్లీ వేదికగా ఇక్కడి దయనీయ పరిస్థితులను వివరించడం జరిగిందన్నారు. జనగామ నియోజకవర్గంలోని రిజర్వాయర్లు, చెరువులను నింపి భూగర్భ జలాల పెంపుపై దృష్టి సారించాలన్నారు. కరువు నేపథ్యంలో ఎండిన ప్రతీ ఎకరాకు ప్రభుత్వం తరఫున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
రేపు దేవాదుల మూడో ఫేజ్ బటన్
ఆన్ చేయనున్న మంత్రి
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి